18వ సారైనా... బెంగళూరు రాత మారేనా! | Indian Premier League starts in 5 days | Sakshi
Sakshi News home page

18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!

Published Mon, Mar 17 2025 3:05 AM | Last Updated on Mon, Mar 17 2025 4:08 AM

Indian Premier League starts in 5 days

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రాత మారేనా!

పాటీదార్‌ సారథ్యంలో బరిలోకి

విరాట్‌ కోహ్లిపైనే భారం

మరో 5 రోజుల్లో ఐపీఎల్‌  

పరుగుల వీరులు... వికెట్లు ధీరులు... మెరుపు ఫీల్డర్లు... అశేష అభిమానులు... విశేష ఆదరణ... ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఒక్కసారి కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. లీగ్‌ ఆరంభం (2008) నుంచి ప్రతిసారీ ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ అంటూ బరిలోకి దిగడం... రిక్తహస్తాలతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. టోర్నమెంట్‌ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్‌ కోహ్లి... తన జెర్సీ నంబర్‌ 18వ సారైనా ట్రోఫీని అందిస్తాడా లేదో వేచి చూడాలి!  – సాక్షి క్రీడావిభాగం 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యధిక జనాదరణ ఉన్న జట్లలో ఒకటైన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడి ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేకపోయిన ఆర్‌సీబీ ఈ సారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. 

లీగ్‌ చరిత్రలో అత్యుత్తమంగా మూడుసార్లు (2009, 2011, 2016లో) రన్నరప్‌గా నిలిచిన ఆర్‌సీబీ... తమ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి జెర్సీ నంబర్‌ 18వ సీజన్‌లో ట్రోఫీ ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ స్టార్‌లపై ఎక్కువ నమ్మకముంచే ఫ్రాంచైజీ ఈసారి దేశీ ఆటగాడు రజత్‌ పాటీదార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 

2021 నుంచి ఆర్‌సీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్‌ జట్టు రాత మారుస్తాడని ఆశిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంతోనే ఈసారి విభిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు ఆర్‌సీబీ సంకేతాలు పంపింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... ఆర్‌సీబీ 22 మంది ప్లేయర్లకే పరిమితమైంది. విరాట్‌ కోహ్లికి రూ. 21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... రజత్‌ పాటీదార్‌ (రూ. 11 కోట్లు), యశ్‌ దయాల్‌ (రూ. 5 కోట్లు)ను రిటైన్‌ చేసుకుంది. 

మ్యాక్స్‌వెల్, సిరాజ్‌ వంటి అంతర్జాతీయ స్టార్లను వదిలేసుకున్న ఆర్‌సీబీ... స్వప్నిల్‌ సింగ్‌ను రూ. 50 లక్షలతో ‘రైట్‌ టు మ్యాచ్‌’ ద్వారా తిరిగి తీసుకుంది. కేఎల్‌ రాహుల్, చహల్, రిషబ్‌ పంత్‌ వంటి వారిని వేలంలో చేజిక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. అటు అనుభవం... ఇటు యువరక్తంతో కూడిన కొత్త బృందాన్ని కొనుగోలు చేసుకుంది. గత సీజన్‌లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు... ఎలిమినేటర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. 

అతడే బలం... బలహీనత 
ఆర్‌సీబీ ప్రయాణాన్ని గమనిస్తే... ఆ జట్టుకు అతిపెద్ద బలం విరాట్‌ కోహ్లినే. అదే సమయంలో బలహీనత కూడా అతడే. విరాట్‌ రాణించిన మ్యాచ్‌ల్లో అలవోకగా విజయాలు సాధించే ఆర్‌సీబీ... అతడు విఫలమైన సమయంలో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేక వెనుకబడి పోతుంది. 17 సీజన్‌లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్‌ ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లాడి 8004 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 

8 శతకాలు, 55 అర్ధశతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఐదు సీజన్‌లలో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి... చాంపియన్స్‌ ట్రోఫీ తాజా ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఫిల్‌ సాల్ట్‌... ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జాకబ్‌ బెథెల్‌... హార్డ్‌ హిట్టర్‌ లివింగ్‌స్టోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 

రూ. 11 కోట్లు పెట్టి తీసుకున్న భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాపై కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశలు పెట్టుకుంది. ఆండీ ఫ్లవర్‌ ఆర్‌సీబీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా... దినేశ్‌ కార్తీక్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.

బౌలర్లపైనే భారం... 
బ్యాటింగ్‌ విషయంలో బలంగా ఉన్న బెంగళూరు... ఈసారి మెరుగైన బౌలింగ్‌ దళంతో బరిలోకి దిగనుంది. ఆస్థాన బౌలర్‌ సిరాజ్‌ను వదిలేసుకున్న ఆర్‌సీబీ... తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆ్రస్టేలియా స్పీడ్‌స్టర్‌ జోష్‌ హాజల్‌వుడ్, ఐపీఎల్‌లో అపార అనుభవం ఉన్న భువనేశ్వర్‌ కుమార్, గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన యశ్‌ దయాల్, దక్షిణాఫ్రికా పేసర్‌ ఇన్‌గిడి పేస్‌ భారాన్ని మోయనున్నారు. 

స్వప్నిల్‌ సింగ్, జాకబ్‌ బెథెల్, సుయశ్‌ శర్మ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న నాణ్యమైన స్పిన్నర్‌ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఇతర స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ బౌలింగ్‌ బృందం ప్రదర్శనపైనే ఆర్‌సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.  

ఆర్‌సీబీ జట్టు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్  ), కోహ్లి, సాల్ట్, జితేశ్‌ శర్మ, దేవదత్‌ పడిక్కల్, స్వస్తిక్, లివింగ్‌స్టోన్, కృనాల్‌ పాండ్యా, స్వప్నిల్‌ సింగ్, టిమ్‌ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్‌ బెథెల్, హాజల్‌వుడ్, భువనేశ్వర్‌ కుమార్, రసిక్, సుయశ్‌ శర్మ, నువాన్‌ తుషారా, ఇన్‌గిడి, అభినందన్‌ సింగ్, మోహిత్‌ రాఠి, యశ్‌ దయాల్‌. 

అంచనా 
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 9 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన చరిత్ర ఉన్న ఆర్‌సీబీ... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement