ఆటకే వీడ్కోలు... ఆదాయంలో రారాజులు | Indian cricketers as brand ambassadors | Sakshi
Sakshi News home page

ఆటకే వీడ్కోలు... ఆదాయంలో రారాజులు

Jul 13 2025 2:17 AM | Updated on Jul 13 2025 2:17 AM

Indian cricketers as brand ambassadors

సచిన్‌ నుంచి కోహ్లి వరకు ఇంకా తగ్గని క్రేజ్‌

ఇప్పటికీ ప్రకటనల్లో కనిపిస్తూ ఆదాయార్జన

బ్రాండ్‌ అంబాసిడర్లుగా వెలుగుతున్న దిగ్గజాలు

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి పుష్కరం గడిచింది. అతని సమకాలీకులు రాహుల్‌ ద్రవిడ్‌ (2012లో ఆఖరి మ్యాచ్‌), సౌరవ్‌ గంగూలీ (2008లో) తమ ఆటను ముగించి చాలా కాలమైంది. ఈతరం దిగ్గజం ధోని కూడా మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. విరాట్‌  కోహ్లి, రోహిత్‌ శర్మ కొన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యారు. కానీ క్రికెట్‌ అభిమానుల్లో వీరందరి పట్ల క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

ఆటకు సంబంధించిన లేదా క్రికెటేతర కార్యక్రమం అయినా సరే...వీరు హాజరైతే చాలు, దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ దిగ్గజ క్రికెటర్లకు వాణిజ్యపరంగా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వీరు వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పని చేస్తుండటం విశేషం. పైగా ఆయా బ్రాండ్‌లకు అంబాసిడర్లుగా మాత్రమే కాకుండా చాలా వ్యాపారాల్లో సహ భాగస్వాములుగా తాము కూడా మార్కెట్‌ను శాసిస్తున్నారు. సాక్షి, క్రీడా విభాగం

ముగ్గురూ ముగ్గురే
సచిన్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం 25 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీటిలో 10 కంపెనీల్లో అతను సహ భాగస్వామి. సగం వాటిలో అతను కేవలం పెట్టుబడులు పెట్టడంతోనే సరిపెట్టగా... మరో సగం కంపెనీ వ్యవహారాల్లో తన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ చురుకైన భాగస్వామిగా ఉన్నాడు.

మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఏకంగా 42 బ్రాండ్స్‌తో జత కట్టాడు. రెగ్యులర్‌గా ప్రకటనల్లో కనిపించే బ్రాండింగ్‌ కాకుండా ప్రీమియం స్పోర్ట్స్‌ టూరిజం కంపెనీ ‘డ్రీమ్‌ సెట్‌ గో’ను సొంత వ్యాపారంలా ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇక రాహుల్‌ ద్రవిడ్‌ వీరిలో మరింత ప్రత్యేకం. ఈ మిస్టర్‌ డిపెండబుల్‌ కనీసం సోషల్‌ మీడియాలో కూడా లేడు. కానీ 24 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా నెమ్మదైన స్వభావానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లాంటి ద్రవిడ్‌.. క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్‌ కంపెనీ ‘క్రెడ్‌’కోసం ‘నేను ఇందిరానగర్‌ గూండాను..’అంటూ చేసిన యాడ్‌ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పేరు ప్రఖ్యాతలే పెట్టుబడిగా...
క్రికెట్‌ నుంచి తప్పుకొని చాలా రోజులైనా ఈ మాజీలకు డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. దీనిపై వ్యాల్యుయేషన్‌ రంగంలో నిష్ణాతులైన హర్‌్ష తలికోటి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కెరీర్‌లో వారు సాధించిన ఘనతలతో వచ్చిన పేరుప్రఖ్యాతులే కాదు.. ప్రజల్లో ఇప్పటికీ ఉన్న క్లీన్‌ ఇమేజ్, అభిమానులకు వారంటే ఉన్న గౌరవం, ఏళ్లు గడిచాక కూడా తమను తాము మార్చుకుంటూ ప్రస్తుత సెలబ్రిటీల్లో కూడా తమ ప్రత్యేకత నిలబెట్టుకోవడమే అందుకు కారణం’అంటాడు. పైగా తాము నమ్మిన, విశ్వాసం ఉన్నవాటితోనే జత కట్టడానికి వీరు సిద్ధమవుతారు. ‘గ్రండ్‌ఫోస్‌’పంప్స్‌ను తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా వాడుతున్నాను కాబట్టి దానికి ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు ద్రవిడ్‌ చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ.

ధోని, విరాట్, రోహిత్‌
ఈతరం అభిమానుల్లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎమ్మెస్‌ ధోని, విరాట్‌ కోహ్లి ప్రస్తుతం చెరో 45 బ్రాండ్లతో కలిసి పని చేస్తుండటం విశేషం. ఇటీవల ‘ఎజిలిటాస్‌’స్పోర్ట్స్‌ కంపెనీలో కోహ్లి రూ.40 కోట్లతో భాగస్వామిగా చేరి అన్నీ తానే అయి నడిపిస్తున్నాడు. 10 స్టార్టప్‌లలో అతను పెట్టుబడులు పెట్టాడు. ధోని కూడా ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఏరో స్పేస్‌ కంపెనీల్లో భాగమయ్యాడు. అలాగే హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ టెస్టులు, టీ20ల నుంచి రిటైరైనా క్రేజ్‌ తగ్గలేదు. అడిడాస్, సియట్, నిస్సాన్‌ వంటి అనేక ప్రముఖ కంపెనీలకు ప్రకటనకర్తగా ఉన్నాడు. సుమారు 20 బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నాడు.

ఉభయతారక ఒప్పందాలు
భారత్‌లో క్రికెటర్లకు పాన్‌ ఇండియా విలువ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఒక్కో ప్రాంతం లేదా భాషకే పరిమితమయ్యే సినిమా తారలతో పోలిస్తే క్రికెటర్ల ప్రకటనలే పెద్ద సంఖ్యలో జనానికి చేరతాయని ప్రకటన రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌ ఒప్పందాలు ఉభయతారకంగా ఉంటూ అటు ప్లేయర్లకు, ఇటు కంపెనీలకు కూడా లాభదాయకంగా ఉండటం కారణంగా ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ కాలపు అనుబంధం కొనసాగుతోంది.

ధోని బ్రాండింగ్‌ చేస్తున్న ఏరో స్పేస్‌ కంపెనీ ‘గరుడ’ఆదాయం ఏడాది తిరిగే లోగా రూ.15 కోట్ల నుంచి రూ. 123 కోట్లకు చేరగా, తర్వాతి సంవత్సరమే కంపెనీ పూర్తిగా లాభాల్లోకి మళ్లింది. కోకాకోలాతో గంగూలీ అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగుతుండగా, పవర్‌ కంపెనీ ల్యుమినస్‌ 15 ఏళ్లుగా సచిన్‌తో కలిసి ఉంది. ఆటకు గుడ్‌బై చెప్పినా మార్కెటింగ్, బ్రాండింగ్‌ను తాము శాసించగలమని ఈ దిగ్గజాలంతా నిరూపిస్తున్నారు.

 ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌కు చెందిన ల్యూబ్రికెంట్స్‌ యాడ్‌లో ద్రవిడ్‌ నటించిన తర్వాత అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయని స్వయంగా కంపెనీ వెల్లడించింది. కర్ణాటకలో ‘గ్రండ్‌ఫోస్‌’పంప్స్‌తో ద్రవిడ్‌ జతకట్టిన తర్వాతే అవి ప్రజలకు మరింత చేరువయ్యాయి.

గరుడ’బ్రాండ్‌తో వచి్చన డ్రోన్ల వ్యాపారం పెరుగుదలకు ధోని మాత్రమే కారణమని ఆ సంస్థ సీఈఓ అగీ్నశ్వర్‌ వెల్లడించడం ‘కెప్టెన్‌ కూల్‌’విలువేమిటో చెబుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement