వైభవ్‌ వచ్చేశాడు... | Indian cricket team announced for tour of Ireland and England | Sakshi
Sakshi News home page

వైభవ్‌ వచ్చేశాడు...

Jun 7 2026 4:13 AM | Updated on Jun 7 2026 4:13 AM

Indian cricket team announced for tour of Ireland and England

తొలిసారి భారత సీనియర్‌ జట్టులో చోటు

ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనకు టీమ్‌ ప్రకటన 

కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ 

చోటు కోల్పోయిన సూర్యకుమార్‌ 

తిలక్‌వర్మకు వైస్‌ కెప్టెన్సీ అవకాశం  

టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిపినా సరే... బ్యాటింగ్‌ ఫామ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్రతికూలంగా మారింది. ఊహించినట్లే సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సెలక్టర్లు అంతటితో ఆగకుండా జట్టునుంచే తీసేశారు. విన్నింగ్‌ టీమ్‌లో సభ్యులైన మరో ఇద్దరిపై కూడా వేటు పడగా... అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి సీనియర్‌ టీమ్‌లోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో చక్కటి బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన శ్రేయస్‌ కొత్త సారథిగా బాధ్యతలు చేపడుతుండగా... హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్సీ ప్రమోషన్‌ సాధించాడు.  

ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న మూడు నెలల తర్వాత భారత క్రికెట్‌ జట్టు పలు మార్పులతో కొత్త సిరీస్‌కు సన్నద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో జరిగే టి20 సిరీస్‌ల కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అజిత్‌ అగార్కర్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. దీంతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్‌ను కూడా సెలక్టర్లు ప్రకటించారు. జూన్‌ 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో 2 టి20ల్లో తలపడిన అనంతరం భారత జట్టు జులై 2 నుంచి 11 మధ్య ఇంగ్లండ్‌తో 5 టి20లు ఆడుతుంది.  

శ్రేయస్‌పై నమ్మకం... 
టి20 ప్రపంచకప్‌ ప్రస్తుత విజేత 2028లో జరిగే తర్వాతి టోర్నీకి సిద్ధమయ్యేందుకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. అదే ఏడాది లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో కూడా భారత్‌ బరిలోకి దిగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ టీమ్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ బృందంలో 31 ఏళ్ల శ్రేయస్‌ అయ్యర్‌ నాయకుడిగా సరైన వ్యక్తి అని సెలక్టర్లు భావించారు. నిజానికి అయ్యర్‌ రెగ్యులర్‌గా టి20 జట్టులో సభ్యుడు కాదు. 2023 డిసెంబర్‌ తర్వాత అతను ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఆడలేదు. 

కానీ ఐపీఎల్‌ ప్రదర్శన అతడిని అందరికంటే ముందు నిలిపింది. మూడు వేర్వేరు టీమ్‌లు (ఢిల్లీ, కోల్‌తా, పంజాబ్‌)లను లీగ్‌లో ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా గుర్తింపు పొందిన శ్రేయస్‌ నాయకత్వంలో 2024లో కోల్‌కతా టైటిల్‌ నెగ్గింది. బ్యాటర్‌గా కూడా గత ఏడాది విధ్వంసకర ప్రదర్శన కనబర్చిన అతను ఈ సీజన్‌లో కూడా మెరుగ్గా ఆడాడు. బ్యాటర్‌గా సూర్యకుమార్‌కు బదులుగా నాలుగో స్థానానికి అతను సరిగ్గా సరిపోతాడు కూడా.  

తిలక్‌కు అరుదైన చాన్స్‌... 
భారత టి20 జట్టులో రెగ్యులర్‌గా మారిన తిలక్‌వర్మకు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైస్‌ కెప్టెన్సీ పదవి దక్కింది. తిలక్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఎ టీమ్‌కు సారథిగా ఉన్నాడు. భారత్‌ తరఫున 49 మ్యాచ్‌లలో 145.54 స్టైక్‌రేట్‌తో 1390 పరుగులు సాధించిన తిలక్‌ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున నిలకడైన ప్రదర్శన కూడా అతనికి తగినంత గుర్తింపు తెచి్చంది. అక్షర్‌ స్థానంలో అతను వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.  

వైభవ్‌పై విశ్వాసం... 
అంచనాలకు తగినట్లుగానే కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీని సెలక్టర్లు టీమ్‌లోకి ఎంపిక చేశారు. గత ఐపీఎల్‌ సీజన్‌లోనే ఆకట్టుకున్నా... ఈసారి మరింతగా విజృంభించి వైభవ్‌ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్‌ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా అంతా భావించారు. అందుకే  సెలక్టర్లు కూడా అతనిపై విశ్వాసం ఉంచారు. వైభవ్‌ ఐర్లాండ్‌తో తొలి టి20లో బరిలోకి దిగితే...భారత్‌ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 92 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బద్దలు కొడతాడు.  

స్థానం కోల్పోయిన రింకూ, కుల్దీప్‌... 
వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులైనవారిలో సూర్యతో పాటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్, బ్యాటర్‌ రింకూ సింగ్‌ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. రింకూ చాలా కాలంగా ఫామ్‌లో లేకపోగా...  ఇటీవలి ఐపీఎల్‌ ఘోర వైఫల్యం కూడా కుల్దీప్‌పై వేటుకు ప్రధాన కారణం. ఆల్‌రౌండర్‌ హార్దిక్, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఈ సిరీస్‌లనుంచి విశ్రాంతి కల్పించారు.  

నితీశ్‌ రెడ్డి పునరాగమనం... 
టి20 వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి టీమ్‌లోకి పునరాగమనం చేశాడు. అతను భారత్‌ తరఫున జనవరి, 2025లో ఆఖరి టి20 మ్యాచ్‌ ఆడాడు. ఇదే తరహాలో లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఇప్పటికే ఎంపిక అయిన ఢిల్లీ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు ఇప్పుడు టి20 టీమ్‌లో స్థానం లభించింది.  

ఆసియా క్రీడలకు బుమ్రా.... 
విశ్రాంతి అనంతరం పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొంటాడు. ఈ మెగా ఈవెంట్‌ కోసం ప్రకటించిన 15 మంది టీమ్‌లో అతనికి స్థానం కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌ సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్లలో ఉన్న మొహమ్మద్‌ సిరాజ్‌ స్థానంలో బుమ్రా వస్తాడు. 16వ ఆటగాడు ప్రిన్స్‌కు కూడా ఆసియా క్రీడల టీమ్‌లో చోటు దక్కలేదు.

పాపం సూర్యకుమార్‌!
గత ఏడాది ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని అందించిన తర్వాత కూడా తర్వాతి సిరీస్‌కు రోహిత్‌ శర్మ తన వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్‌తో పోలిస్తే సూర్యకుమార్‌ యాదవ్‌ పరిస్థితి ఇంకా బాధాకరం. వరల్డ్‌ కప్‌ గెలిచాక కెప్టెన్సీతో పాటు అతనికి జట్టులో కూడా చోటు పోయింది. నిజానికి ప్రపంచ కప్‌కు ముందు చాలా కాలం పాటు అతని ఫామ్‌ పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌పై మంచి ప్రదర్శనే ఇచ్చినా... ఆ తర్వాత మళ్లీ తడబాటు కనిపించింది. అయితే కీలకమైన టోర్నీకి ముందు కొత్త కెప్టెన్‌ వస్తే కష్టమని సెలక్టర్లు వెనక్కి తగ్గారు. 

మెగా టోర్నీలో అమెరికాపై మ్యాచ్‌ మినహా అతను అన్నింటా విఫలమయ్యాడు.  ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా అంతే స్థాయిలో మళ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో సెలక్టర్లకు మరో ఆలోచన లేకపోయింది. పైగా 36 ఏళ్లకు చేరువవుతున్న ప్రస్తుత స్థితిలో మరో రెండేళ్ల తర్వాత జరిగే వరల్డ్‌ కప్‌కు కొనసాగించే అవకాశం ఎలాగూ లేదనేది వాస్తవం. ప్రపంచకప్, ఆసియా కప్‌లు గెలవడంతో పాటు తన సారథ్యంలో ఒక్క సిరీస్‌ కూడా కోల్పోని రికార్డు సూర్య సొంతం. 

టి20 క్రికెట్‌లో విధ్వంసక ఆటగాడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్‌ అంతర్జాతీయ కెరీర్‌ ఇక ముగిసినట్లే. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. అతని పేలవ ఫామ్‌ కొంత కారణమే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టు అవసరాల కోసం తప్పలేదు. ప్రపంచ కప్‌ను గెలిపించిన తర్వాత జట్టునుంచి తప్పించడంపై చాలానే చర్చ జరిగింది. నేను కూడా అతనితో మాట్లాడి అంతా వివరించా’ అని అగార్కర్‌ వ్యాఖ్యానించాడు.  

ఇంగ్లండ్‌ పర్యటనకు భారత జట్టు
శ్రేయస్‌ (కెప్టెన్‌), తిలక్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్, సామ్సన్, వైభవ్, ఇషాన్‌ కిషన్, శివమ్‌ దూబే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్, సుందర్, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్ దీప్  , హర్షిత్‌ రాణా, ప్రిన్స్‌ యాదవ్‌. (ఆసియా క్రీడలకు సిరాజ్‌ స్థానంలో బుమ్రా ఎంపిక కాగా...ప్రిన్స్‌కు చోటు లేదు).

Advertisement
 
Advertisement
Advertisement