Asia Cup 2023, India vs. Pakistan: నేడే ‘ఆసియా’ అసలు సమరం | Asia Cup 2023, India vs. Pakistan: Time, Playing XI, And Live Streaming Details - Sakshi
Sakshi News home page

Asia Cup 2023, India vs. Pakistan: నేడే ‘ఆసియా’ అసలు సమరం

Sep 2 2023 2:58 AM | Updated on Sep 2 2023 9:42 AM

India vs pakistan match today  - Sakshi

పల్లెకెలె: వన్డే ప్రపంచకప్‌కు ఇంకొన్ని రోజులే ఉంది. మెగా ఈవెంట్‌కు ముందు క్రికెట్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకునే కీలక మ్యాచ్‌ నేడు జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ జట్లు సై అంటే సై అనే పోరుకు ఆసియా కప్‌ వన్డే టోర్నీ వేదికైంది. నంబర్‌వన్‌ పాక్, ఆసియా కప్‌ ఫేవరెట్‌ భారత్‌ మధ్య జరగబోయే ఈ పోరు టోర్నీకే హైలైట్‌గా నిలవడం ఈపాటికే ఖాయమైంది.

కేవలం వన్డే ఫార్మాట్‌నే చూసుకుంటే గత వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఇరు జట్లు తలపడే 50 ఓవర్ల పోటీ ఇదే! గతేడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో విరాట్‌ అద్భుత ప్రదర్శన తర్వాత ఇరు జట్లు ఇప్పుడు తలపడుతున్నాయి. మెల్‌బోర్న్‌ తరహాలో లంక గడ్డపై కూడా మరో హోరాహోరీ ఖాయం.  

కొత్త ఉత్సాహంతో రోహిత్‌ బృందం 
గత కొన్నాళ్లుగా స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌ కోసం భారత్‌ చాలా ప్రయోగాలు చేసింది. రాహుల్, అయ్యర్, బుమ్రావంటి కీలక ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌  తగిన జాగ్రత్తలు తీసుకొని సీనియర్లు రోహిత్, కోహ్లిలకు బాగా విశ్రాంతినిస్తూ కాపాడుకుంటూ వచ్చింది. ఇక సమయం, సందర్భం రావడంతో టీమిండియా తురుపుముక్కలు బరిలోకి దిగుతున్నారు. ఒక్క మాటలో  చెప్పాలంటే ఇది కచ్చితంగా ‘ప్రి ప్రపంచకప్‌’ పోటీనే! ఇందులో ఏ సందేహం లేదు.

దాదాపు వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే జట్టును ఖాయం చేసేందుకు ఈ ఆసియా టోర్నీని జట్టు వాడుకుంటోంది. రోహిత్, కోహ్లిల ఫిట్‌నెస్, జట్టులోకి అనుభవజు్ఞడైన ఆల్‌రౌండర్‌ జడేజా పునరాగమనం, మరో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, బౌలింగ్‌ దళపతి బుమ్రా, ‘హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌’ సిరాజ్‌ ఇలా చెప్పుకుంటూ పోతే భారత్‌ పూర్తి స్థాయి ప్రపంచకప్‌ సైన్యంతో రంగంలోకి దిగుతోంది. దీన్నిబట్టి చూస్తే పాక్‌ పనిపట్టేందుకు, ఆసియా కప్‌లో ఓడించేందుకు రోహిత్‌ సేనకు ఏమంత కష్టం కానేకాదు. 

పుంజుకున్న బలంతో పాక్‌ 
కొంత కాలంగా ఇంటాబయటా నిలకడైన విజయాలు, గట్టి ప్రత్యర్థులను ఓడించిన తీరుతో బాబర్‌ ఆజమ్‌ సేన మునుపటి కంటే పుంజుకుంది. బ్యాటింగ్‌లో ఫఖర్‌–ఇమామ్‌ ఓపెనింగ్‌ జోడీ నుంచి ఏడో నంబర్‌ షాదాబ్‌ ఖాన్‌ వరకు బ్యాటింగ్‌ చేసే సత్తా పాకిస్తాన్‌ పటిష్టంగా నిలుపుతోంది. బౌలింగ్‌లో పేస్‌ త్రయం షాహిన్‌ అఫ్రిది, నసీమ్‌ షా, రవూఫ్‌ ఆరంభంలో వికెట్లు పడగొట్టడంతో సఫలమవుతున్నారు. స్పిన్‌లో షాదాబ్, నవాజ్‌ సత్తా చాటుతుండటంతో పాకిస్తాన్‌ భారత్‌కు దీటుగా ఉంది. నంబర్‌వన్‌ హోదా అదనపు స్థైర్యాన్ని తెచ్చిపెట్టగా... రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థిని ఢీకొనేందుకు రెడీగా ఉంది. 

గత ఐదు వన్డేల్లో... 
భారత్, పాక్‌లు తలపడిన గత ఐదు వన్డేల్లో టీమిండియాదే 4–1తో పైచేయిగా ఉంది. 2017 చాంపియన్స్‌ట్రోఫీలో లీగ్‌ దశలో గెలిచి తుదిపోరులో భారత్‌ ఓడింది. 2018 ఆసియాకప్‌లో రెండుసార్లు టీమిండియా గెలిచింది. చివరిసారిగా గత వన్డే ప్రపంచకప్‌(2019)లోనూ భారత్‌దే గెలుపు.

పిచ్‌–వాతావరణం 
ఇది కొత్త పిచ్‌. పక్కాగా దీనికే అనుకూలమని చెప్పలేం. లంక, బంగ్లా మధ్య జరిగినట్లే సీమర్లు, స్పిన్నర్లకు చక్కని చాన్స్‌! అయితే మ్యాచ్‌కు వాన ముప్పు పొంచివుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాన కురిసే అవకాశముండటంతో మ్యాచ్‌ మొదలయ్యేందుకు ఆలస్యం కావొచ్చు. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్ ), శుబ్‌మన్, కోహ్లి, అయ్యర్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా, జడేజా, శార్దుల్‌ /షమీ, కుల్దీప్, సిరాజ్, బుమ్రా. 
పాకిస్తాన్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్ ), ఫఖర్‌ జమాన్, ఇమామ్‌ ఉల్‌ హక్, రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్, షాదాబ్‌ఖాన్, నవాజ్, షాహిన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, రవూఫ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement