
చివరి నిమిషంలో గోల్ చేసిన స్ట్రయికర్
భారత్, సింగపూర్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’
ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్
సింగపూర్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఆశలు సజీవంగా ఉంచుకుంది. మూడో రౌండ్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో పటిష్ట సింగపూర్‌తో మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. గురువారం సింగపూర్‌తో జరిగిన పోరును భారత్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున రహీమ్ అలీ (90వ నిమిషంలో) అద్భుత గోల్ సాధించగా... సింగపూర్ తరఫున ఇఖ్‌సాన్ ఫండీ (45+1వ నిమిషంలో) ఓ గోల్ చేశాడు.
కేవలం పది మంది ఆటగాళ్లతోనే ద్వితీయార్ధం మొత్తం పోరాడిన భారత్... ప్రత్యర్థిని నిలువరించడం విశేషం. ఖాలిద్ జమీల్ శిక్షణలోని భారత జట్టు... గొప్ప పోరాట పటిమ కనబర్చింది. మ్యాచ్ ఆరంభం నుంచి సింగపూర్ జట్టు ఆధిపత్యం సాగింది. 60 శాతానికి పైగా బంతిని నియంత్రణలో పెట్టుకున్న ఆ జట్టు... పకడ్బందీ పాసింగ్‌తో భారత డిఫెన్స్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. సొంతగడ్డపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన సింగపూర్... చిన్నచిన్న పాస్‌లతో బంతిని ఏమారుస్తు మన డిఫెండర్లను బోల్తా కొట్టించింది.
తొలి అర్ధభాగం ముగియడానికి క్షణాల ముందు ఇఖ్‌సాన్ ఫండీ భారత డిఫెన్స్ లోపాలను వాడుకుంటూ చక్కటి గోల్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అప్పటికే భారత డిఫెండర్ సందేశ్ జింఘాన్‌కు రెఫరీ రెండుసార్లు యెల్లో కార్డు చూపడంతో... 47వ నిమిషంలో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. అప్పటికే ప్రత్యర్థికి ఆధిక్యం అప్పగించుకున్న టీమిండియా... ఇక ఆ తర్వాత చివరి వరకు 10 మంది ప్లేయర్లతోనే ఆడింది.
మ్యాచ్ మొత్తం 90 నిమిషాల్లో భారత జట్టుకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక సింగపూర్ విజయం ఖాయమైపోయిన దశలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన రహీమ్ అలీ అద్భుతం చేశాడు. అఖర్లో అవకాశం దక్కించుకున్న రహీమ్ చక్కటి గోల్‌తో భారత జట్టును పోటీలోకి తెచ్చాడు. దీంతో స్కోరు 1–1తో సమం కాగా... ఆ తర్వాత మిగిలిన సమయంలో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించలేకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
గ్రూప్ ‘సి’లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడిన భారత్... హాంకాంగ్ చేతిలో ఓడి... బంగ్లాదేశ్, సింగపూర్‌లతో మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొంది. 2 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. సింగపూర్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కో గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన జట్టు మాత్రమే 2027 ఆసియాకప్‌నకు అర్హత సాధించనుంది. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగిలిన మూడు జట్లతో ఇంటా బయట మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య 14న గోవా వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.