సిరీస్‌పై గురి... | India plays its third T20 against New Zealand today | Sakshi
Sakshi News home page

సిరీస్‌పై గురి...

Jan 25 2026 3:54 AM | Updated on Jan 25 2026 3:57 AM

India plays its third T20 against New Zealand today

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ మూడో టి20 

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం

గువాహటి: సొంతగడ్డపై టి20 ప్రపంచకప్‌నకు ముందు ఆడుతున్న చివరి దైపాక్షిక సిరీస్‌లో టీమిండియా జోరు కనబరుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన రెండు టి20ల్లోనూ గెలిచిన సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత జట్టు నేడు న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... అదే జోష్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడే సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. 

మరో వైపు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ జట్టు... టి20ల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. ముఖ్యంగా టీమిండియా హిట్టర్లను కట్టడి చేయడంలో కివీస్‌ బౌలర్లు విఫలమవుతున్నారు. మరి సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. పిచ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించనుండగా... మంచు ప్రభావం ఉండనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది.  

సంజూ రాణించేనా..! 
ఐసీసీ టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. మెగాటోర్నీలో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడనుకుంటున్న సంజూ సామ్సన్‌ గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. అదే సమయంలో రెండో టి20ల్లో ఇషాన్‌ కిషన్‌ చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా సంజూ స్థాయికి తగ్గ ప్రద్రర్శన చేస్తాడా చూడాలి. 

ముఖ్యంగా సామ్సన్‌ పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. దాన్ని అధిగమించకపోతే... మెగా టోర్నీలో తిలక్‌ వర్మ వస్తే సామ్సన్‌ స్థానాన్ని ఇషాన్‌ భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అభిషేక్‌ గత మ్యాచ్‌లో ‘గోల్డెన్‌ డకౌట్‌’ అయినా... అతడి దూకుడుపై ఎవరికీ సందేహాలు లేవు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేసుకునే అభిõÙక్‌ నుంచి అభిమానులు అలాంటి సుడిగాలి ఇన్నింగ్స్‌లే ఆశిస్తున్నారు. 

ఇక సుదీర్ఘ కాలం తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌నకు ముందు ఇది జట్టుకు శుభపరిణామం కాగా... మిడిలార్డర్‌లో శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌ రూపంలో ధాటిగా ఆడగల సమర్థులు ఉన్నారు. వీరంతా కలిసికట్టుగా కదం తొక్కితే... మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్, హర్షిత్‌ రాణా, కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి కీలకం కానున్నారు. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి వస్తే హర్షిత్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. 

డరైల్‌ మిచెల్‌పై ఆశలు 
టీమిండియాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన డారిల్‌ మిచెల్‌పై న్యూజిలాండ్‌ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన అతడు టి20ల్లో మాత్రం పెద్దగా మెరవడం లేదు. దీంతో కివీస్‌ గెలుపుబాట పట్టలేకపోతోంది. ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్‌ జట్టుకు మెరుపు ఆరంభాలను ఇచ్చినట్లే కనిపిస్తున్నా... ఈ జంట ఎక్కువసేపు నిలవలేకపోతుండటంతో మిడిలార్డర్‌పై భారం పడుతోంది. 

గత మ్యాచ్‌లో చక్కటి షాట్‌లతో ఆకట్టుకున్న రచిన్‌ రవీంద్ర అదే జోరు కొనసాగించాలని చూస్తుండగా... గ్లెన్‌ ఫిలిప్స్, మార్క్‌ చాప్‌మన్, సాంట్నర్‌ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్‌ సాంట్నర్‌ గత మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్నా... బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 

ఫౌల్క్స్ బంతులనైతే టీమిండియా బ్యాటర్లు చీల్చి చెండాడారు. మూడు ఓవర్లలోనే 67 పరుగులు సమర్పించుకున్న అతడు కివీస్‌ పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కివీస్‌ సమష్టిగా సత్తా చాటాలని భావిస్తోంది. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్, దూబే, హార్దిక్, రింకూ సింగ్, హర్షిత్‌/ బుమ్రా, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్‌ చక్రవర్తి. 
న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్), కాన్వే, సైఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, డరైల్‌ మిచెల్, చాప్‌మన్, ఫౌల్క్స్, హెన్రీ, సోధి, డఫీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement