ఢాకా వేదికగా జరగనున్న సెకెండ్ ఎడిషన్ అంధుల క్రికెట్ ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) ప్రకటించింది. 24 మంది యువ క్రీడాకారులతో 10 రోజుల పాటు జరిగిన ఇంటెన్సివ్ సెలక్షన్, కోచింగ్ క్యాంప్ అనంతరం ఈ జట్టును సీఏబీఐ ఖరారు చేసింది.
ఈ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు దుర్గారావు తోంపాకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఆసియాకప్ టోర్నీకి ఎంపికైన ఆటగాళ్లు బంగ్లాదేశ్‌కు వెళ్లేముందు ఢిల్లీలో నెల రోజుల పాటు జరిగే సన్నాహక శిబిరంలో పాల్గొంటారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్‌నెస్, కండిషనింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించనున్నారు.
బీ1 విభాగంలో నరేష్ తుమ్డా, సంజయ్ కుమార్ షా, దేబరాజ్ బెహెరా, అశోక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ రావత్‌లు ఎంపిక కాగా.. బీ2 కేటగిరీలో దున్న వెంకటేశ్వరరావు, రాంబీర్ సింగ్, లోకేషా, మనీష్ కుమార్, నకుల బడానాయక్ ఉండగా, బీ3 కేటగిరీలో దుర్గారావు టోంపకి, సునీల్ రమేష్, సుఖ్‌రామ్ మాఝీ, ఏ రవి, దినేష్ రథ్వా, దీపక్‌లు సెలక్ట్ అయ్యారు. కాగా ఈ బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ నవంబర్ 15 నుండి 20 వరకు ఢాకా వేదికగా జరగనుంది.


