
6 స్వర్ణాలు సహా మొత్తం 22 పతకాలు
చివరి రోజు సిమ్రన్, ప్రీతి, నవ్‌దీప్‌కు రజతాలు
ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. సొంతగడ్డపై జరిగిన పోటీల్లో రికార్డు స్థాయిలో 22 పతకాలు సాధించారు. పోటీల చివరి రోజు ఆదివారం భారత్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో 4 పతకాలు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత పారా అథ్లెట్లు మొత్తం 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో పదో స్థానంలో నిలిచారు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 2024లో (జపాన్) అత్యుత్తమంగా 17 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో బ్రెజిల్ 44 (15 స్వర్ణాలు, 20 రజతాలు, 9 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 100 మీటర్ల టి35 విభాగంలో ప్రీతిపాల్ 14.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం సాధించింది. టి35 200 మీటర్ల పరుగులో సైతం ప్రీతి కాంస్యం నెగ్గింది.
పురుషుల జావెలిన్ ఎఫ్41 విభాగంలో పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత నవ్‌దీప్ సింగ్ రజతం గెలిచాడు. నవ్‌దీప్ జావెలిన్‌ను 45.46 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 200 మీటర్ల టి12 విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సిమ్రన్ 24.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల టి44 విభాగంలో సందీప్ 23.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం పతకం కైవసం చేసుకున్నాడు.