ఒంటి కాలితో సాధించింది | Para throwball sport Bhagya Gold medal | Sakshi
Sakshi News home page

ఒంటి కాలితో సాధించింది

Apr 1 2025 1:28 PM | Updated on Apr 1 2025 3:01 PM

Para throwball sport Bhagya Gold medal

పారా త్రోబాల్‌ క్రీడలో రాణిస్తున్న భాగ్య 

ఒంటి కాలుతో దేశానికి బంగారు పతకం 

అంతర్జాతీయ స్థాయిలో  గుర్తింపు

దివ్యాంగులకు చేయూతనందించాలి: భాగ్య

గూడూరు: ప్రతిభకు పేదరికం.. అంగవైక ల్యం అడ్డుకాదని నిరూపించింది ఓ యువతి. చిన్నప్పటి నుంచి ఆట, పాటలు, క్రీడలపై మ క్కువ పెంచుకొని రాణిస్తోంది. దివ్యాంగురా లైనా పారా త్రోబాల్‌ క్రీడలో అత్యంత ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తె చ్చుకుంది. గతేడాది కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్‌ క్రీడలో దేశం తరఫున పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించింది మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గొల్లగూడెంకు చెందిన దయ్యాల కొమురయ్య, కొమురమ్మ కూతురు భాగ్య. 

ఒకే కాలుతో పుట్టి.. 
కొమురయ్య, కొమురమ్మలది పేద కుటుంబం. వారికి కొడుకు, కూతురు భాగ్య ఉన్నా రు. భాగ్య ఒంటికాలుతో పుట్టింది. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. ఆమెకు పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. దీంతో డిగ్రీ పూర్త యిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎంఏ చేస్తోంది. ఫోకో ఆర్ట్స్‌ కోర్సులో భాగంగా డప్పు, జానపద గేయాలు, కర్రసాము, చెక్కభజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకుంది. బతుకమ్మ పాటలను సేకరించి పాడటం అలవాటుగా మార్చుకుంది.

ఎల్‌బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శనతో...
ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసేబిలి టీస్‌ అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని 2022, డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నాలుగురోజుల ముందు నుంచి ఆటలు, డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ జరిగాయి. భాగ్య డ్యాన్స్‌ చేయగా ఫొటోలు పేపర్‌లో వచ్చాయి. ‘అప్పుడు నేను చదువుతున్న పొట్టిశ్రీరాము లు యూనివర్సిటీ వీసీ కిషన్‌రావు సర్‌ నన్ను పిలిపించి మాట్లాడారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి, పింఛన్‌తో హాస్టల్‌ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నాననే విషయం తెలుసుకొని చలించిపోయారు. వెంటనే ఎవరితో మాట్లా డారో తెలియదు కానీ జర్మనీ నుంచి డ్యాన్స్‌ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్‌ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఆ తర్వాత ఆ కాలితో నడక ప్రాక్టీస్‌ చేసి డ్యాన్స్‌ చేశాను’ అని భాగ్య వివరించింది. 

రాజరాజేశ్వరుడి ఆశీర్వాద బలంతో.. 
మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ రాజరాజేశ్వరుడి గుడిలో భాగ్య నాట్యం చేసింది. ఈక్రమంలో ఆమె నాట్యం చూసిన ఓ వ్యక్తి ఆమెకు దివ్యాంగులు ఆడే సిట్టింగ్‌ వాలీబాల్‌ గురించి తెలియజేశాడు. అయితే ఆ ఆటకు ఇక్కడ ఆదరణ లేదని, రాజస్తాన్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలో ఎంతో ప్రాముఖ్యం ఉందని తెలిపాడు. దీంతో ఆమె ఓ ప్రైవేట్‌ సంస్థ సహకారంతో ఆ ఆటలో శిక్షణ పొంది ఆ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని గెలిచింది. ఆ తర్వాత దేశం తరఫున థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలో ఆడే అవకాశం వచ్చింది. కానీ 2019లో కరోనా కారణంగా పోటీలు రద్దయ్యాయి. 

అయితే ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పటికీ ఆమె క్రీడను వదిలిపెట్టలేదు. నేషనల్‌ పారా ఒలింపిక్‌ సంస్థ ఆధ్వర్యంలో 2024, సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు జార్ఖండ్‌లో జరిగిన పారా త్రోబాల్‌ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటింది. అనంతరం అదే సంవత్సరం డిసెంబర్‌ 2 నుంచి 5 వరకు కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్‌ పోటీల్లో పాల్గొని దేశానికి బంగారు పతకం తెచ్చిపెట్టింది. ఈమేరకు తనకు కొందరు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారని, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారా త్రోబాల్, వాలీబాల్‌ క్రీడలను ప్రోత్సహించి, తనలాంటి దివ్యాంగులకు చేయూతనందించి, ముందుకు నడిపించాలని భాగ్య కోరుతోంది.

ఎమ్మెల్యేలతో సీఎంను కలిసినా ఫలితం లేదు
పారా త్రోబాల్‌ క్రీడలో దేశానికి బంగారు పతకం తీసుకొచ్చిన తన గురించి తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌ నన్ను సీఎం రేవంత్‌రెడ్డిని కలిపించారు. నా గురించి చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. దేశానికి బంగారు పతకం తీసుకొచ్చినా, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. 
– భాగ్య, దివ్యాంగురాలు, క్రీడాకారిణి  

Advertisement
 
Advertisement
Advertisement