ఘనంగా గ్లాస్గో గేమ్స్ ముగింపు వేడుకలు
భారత్‌కు కామన్వెల్త్ పతాకం ప్రదానం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ కమిటీ నుంచి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు... అతడి నుంచి దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు... ఆమె చేతుల మీదుగా గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీకి... ఇలా కామన్వెల్త్ క్రీడల పతాకం 2030 పోటీలు జరిగే అహ్మదాబాద్‌కు చేరింది. దాంతో అధికారికంగా గ్లాస్గో క్రీడలు ముగిశాయి.
పరిమిత సమయంలో, పరిమిత వనరులతోనే కామన్వెల్త్ గేమ్స్‌కు సిద్ధమైన స్కాట్లాండ్ ప్రభుత్వం సమర్థంగా, ఘనంగా నిర్వహించి ప్రశంసలందుకుంది. పోటీల ప్రధాన స్టేడియం ‘హైడ్రో’లో ముగింపు కార్యక్రమం కూడా అన్ని విధాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ముఖ్యంగా తర్వాతి పోటీల వేదిక అయిన భారత్ గురించి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆసాంతం ఆకట్టుకున్నాడు.
‘వసుధైక కుటుంబం’ థీమ్‌లో వందేమాతరాన్ని ఆలపించిన సింగర్ శంకర్ మహదేవన్... అయ్ వతన్, సబ్ సే ఆగే హిందూస్తానీ, లహరాదో, భాగ్ మిల్కా భాగ్ వంటి పాటలతో అలరించాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 2026+2030 పోటీల ఆతిథ్య దేశాల సంగీతాలను కలుపుతూ రిషభ్ రికిరామ్ శర్మ, రాస్ ఎయిన్‌స్లీ ప్రదర్శించిన ‘ఫ్యూజన్’ మరో హైలైట్‌గా నిలిచింది.
స్కాటిష్ సింగర్ స్యాండీ థామ్, ఆ్రస్టేలియా గాయని డెల్టా గూడ్రెమ్ పాడిన పాటలు, స్కాటిష్ స్టెప్ డాన్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపగా, ఈ పోటీల్లో ఆటగాళ్ల ప్రదర్శనతో రూపొందించిన ‘స్పోర్ట్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్’ ఏవీ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. గ్లాస్గో చైర్మన్ జార్జ్ బ్లాక్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ సందేశంతో కార్యక్రమం ముగిసింది. 74 దేశాలకు చెందిన అథ్లెట్లు ముగింపు కార్యక్రమంలో పాల్గొనగా... భారత్ నుంచి బాక్సర్ జైస్మీ¯Œ జాతీయ పతాకంతో ముందు నడిచింది.
‘ఘనంగా నిర్వహిస్తాం’
2030 కామన్వెల్త్ గేమ్స్‌పై గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ
గ్లాస్గో: రెండు దశాబ్దాల తర్వాత భారత్ మరోసారి కామన్వెల్త్ క్రీడలకు వేదిక అవుతోంది. 2030లో జరిగే పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ పోటీలు జరుగుతాయి. గ్లాస్గో ముగింపు వేడుకల్లో సీడబ్ల్యూజీ నిర్వాహకులు సంప్రదాయ రీతిలో పోటీల జెండాను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి హర్ష్ సంఘ్వీకి అందజేశారు. ఈ నేపథ్యంలో గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆయన పలు అంశాలు మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఘనంగా, అత్యుత్తమంగా పోటీలను నిర్వహిస్తామని హర్ష్ సంఘ్వీ చెప్పారు. 2010లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లోని ఢిల్లీ నగరంలో జరిగాయి.
‘కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఇప్పటికే అహ్మదాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. 20 శాతం వసతులను మెరుగు పరిస్తే చాలు. క్రీడాభివృద్ధిలో భాగంగా మేం చేస్తున్న పనులు 2028 చివర్లో పూర్తవుతాయి. కొత్తగా నిర్మించే స్టేడియంలను యువ అథ్లెట్ల శిక్షణ, హాస్టల్ వసతి కోసం వినియోగిస్తాం. ఇప్పటికిప్పుడు గేమ్స్ నిర్వహించగల హోటల్ వసతి, రవాణా సౌకర్యాలు మా వద్ద ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు’ అని సంఘ్వీ వివరించారు.


