
400 మీటర్ల పరుగులో తెలంగాణ అథ్లెట్‌కు రెండో స్థానం
శైలేశ్‌కు పసిడి పతకం
వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. పారిస్ పారాలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగు టి20 విభాగంలో బరిలోకి దిగిన దీప్తి శనివారం ఫైనల్లో 55.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో దీప్తికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... టర్కీకి చెందిన అయెసెల్ ఒండెర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ 54.51 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఉక్రెయిన్ యులియా షులియర్ (56.20 సెకన్లు)కు కాంస్యం దక్కింది. న్యూఢిల్లీ వేదికగా శనివారం ఘనంగా ప్రారంభమైన వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో తొలి రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. దీప్తి రజతం చేజిక్కించుకోగా... హై జంప్‌లో భారత అథ్లెట్లు రెండు పతకాలు కైవసం చేసుకున్నారు.
పురుషుల హై జంప్ టి42 విభాగంలో శైలేశ్ కుమార్ స్వర్ణం గెలుచుకోగా... వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గాడు. శైలేశ్ 1.91 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలవగా... పారా ఆసియా క్రీడల పతక విజేత వరుణ్ సింగ్ 1.85 మీటర్లతో కాంస్యం నెగ్గాడు. భారత్‌కే చెందిన రాహుల్ (1.78 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు.