Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్‌ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్‌

India clinches series with final over thriller, earns 100th T20 win - Sakshi

రెండో టి20లో 8 పరుగులతో భారత్‌ గెలుపు

విండీస్‌తో టి20 సిరీస్‌ సొంతం

పంత్, కోహ్లి అర్ధ సెంచరీలు

పావెల్, పూరన్‌ పోరాటం వృథా

రావ్‌మన్‌ పావెల్, నికోలస్‌ పూరన్‌ మెరుపు ప్రదర్శన భారత్‌ను ఓడించడానికి సరిపోలేదు. కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించిన భారత్‌ ప్రత్యర్థిని కట్టడి చేసి వరుసగా రెండో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి ఓవర్లో విండీస్‌ విజయానికి 25 పరుగులు కావాల్సి ఉండగా తొలి రెండు బంతుల్లో 2 పరుగులే వచ్చాయి.

అయితే తర్వాతి రెండు బంతులను పావెల్‌ రెండు సిక్సర్లుగా మలచడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి రెండు బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాల్సిన స్థితిలో హర్షల్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. అంతకుముందు పంత్, కోహ్లి జోరుతో భారత్‌ భారీ స్కోరుతో సవాల్‌ విసిరింది.

India Vs West indies 2nd T20- కోల్‌కతా: వన్డే సిరీస్‌లాగే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను కూడా భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. టి20ల్లో భారత్‌కిది 100వ విజయం. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పంత్‌ (28 బంతుల్లో 52 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), కోహ్లి (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ లు సాధించగా, వెంకటేశ్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

అనంతరం వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. పావెల్‌ (36 బంతుల్లో 68 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్‌ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 60 బంతుల్లోనే 100 పరు గులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. మూడో టి20 ఆదివారం జరుగుతుంది.

ఓపెనర్లు విఫలం...
ఇషాన్‌ కిషన్‌ (2) తొలి ఓవర్లోనే అవుట్‌ కాగా... 2 పరుగుల వద్ద కింగ్‌ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్‌ శర్మ (19) కూడా ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు. కోహ్లి తాను ఆడిన తొలి 15 బంతుల్లోనే అతను ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. ఛేజ్‌ బౌలింగ్‌లో బౌండరీ వద్ద హోల్డర్‌ క్యాచ్‌ వదిలేయగా, అది సిక్సర్‌గా మారడంతో 39 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో కోహ్లి వెనుదిరిగాడు.

ఆ తర్వాత పంత్, వెంకటేశ్‌ జోరు మొదలైంది. ఛేజింగ్‌లో పూరన్‌ తన తొలి ఐదు బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టి వేగంగా ఇన్నింగ్స్‌ ఆరంభించగా, మరోవైపు పావెల్‌ కూడా ధాటిని ప్రదర్శించాడు.  10 ఓవర్లలో విండీస్‌ స్కోరు 73 పరుగులకు చేరింది. ఈ దశలో పూరన్, పావెల్‌ దూకుడు ప్రదర్శించడంతో తర్వాతి ఐదు ఓవర్లలోనే 51 పరుగులు వచ్చాయి. చహర్‌ ఓవర్లో కూడా రెండు సిక్స్‌లు బాదడంతో విండీస్‌ విజయ సమీకరణం 3 ఓవర్లలో 37 పరుగులకు చేరింది. ఇలాంటి స్థితిలో 18వ ఓవర్లో హర్షల్‌ 8 పరుగులే ఇవ్వగా, 19వ ఓవర్లో భువీ 4 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.
  
స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) కింగ్‌ (బి) ఛేజ్‌ 19; ఇషాన్‌ కిషన్‌ (సి) మేయర్స్‌ (బి) కాట్రెల్‌ 2; కోహ్లి (బి) ఛేజ్‌ 52; సూర్యకుమార్‌ (సి అండ్‌ బి) ఛేజ్‌ 8; పంత్‌ (నాటౌట్‌) 52; వెంకటేశ్‌ (బి) షెఫర్డ్‌ 33; హర్షల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. 
వికెట్ల పతనం: 1–10, 2–59, 3–72, 4–106, 5–182.
బౌలింగ్‌: హొసీన్‌ 4–0–30–0, కాట్రెల్‌ 3–1–20–1, హోల్డర్‌ 4–0– 45–0, షెఫర్డ్‌ 3–0–34–1, ఛేజ్‌ 4–0–25–3, స్మిత్‌ 1–0–10–0, పొలార్డ్‌ 1–0–14–0.  

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ 22; మేయర్స్‌ (సి అండ్‌ బి) చహల్‌ 9; పూరన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) భువనేశ్వర్‌ 62; పావెల్‌ (నాటౌట్‌) 68; పొలార్డ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178.  
వికెట్ల పతనం: 1–34, 2–59, 3–159.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–29–1, దీపక్‌ చహర్‌ 4–0–40–0, చహల్‌ 4–0–31–1, హర్షల్‌ 4–0–46–0, రవి బిష్ణోయ్‌ 4–0–30–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top