సూర్య, ఇషాన్‌ విధ్వంసం | India beat Kiwis by 7 wickets in second T20 | Sakshi
Sakshi News home page

సూర్య, ఇషాన్‌ విధ్వంసం

Jan 24 2026 4:05 AM | Updated on Jan 24 2026 4:05 AM

India beat Kiwis by 7 wickets in second T20

రెండో టి20లోనూ భారత్‌దే విజయం 

సిరీస్‌లో 2–0తో పైచేయి

7 వికెట్లతో న్యూజిలాండ్‌ చిత్తు 

రేపు గువాహటిలో మూడో మ్యాచ్‌  

టి20ల్లో భారత్‌ ఆధిపత్య ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్‌ తొలి పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా మరో ఏకపక్ష గెలుపును అందుకొని 2–0తో పైచేయి సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ 209 పరుగుల లక్ష్యం పెద్దదిగా అనిపించినా... భారత్‌ అలవోకగా 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 

ఓపెనర్లు విఫలమైన చోట ఈసారి నేనున్నానంటూ ఇషాన్‌ కిషన్‌ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఎట్టకేలకు తన స్థాయిని చూపిస్తూ కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ ఫార్మాట్‌లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో బౌండరీల (21 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్వారానే 156 పరుగులు వచ్చాయి.  

రాయ్‌పూర్‌: భారత జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్‌ సాంట్నర్‌ (27 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రచిన్‌ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. 

అనంతరం భారత్‌ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 82 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 76; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. 

ఆ తర్వాత సూర్య, శివమ్‌ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో అభేద్యంగా 81 పరుగులు జత చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. గాయం కారణంగా అక్షర్‌ పటేల్‌ ఆడలేదు. వీరిద్దరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది.  

హాఫ్‌ సెంచరీ లేకుండానే... 
న్యూజిలాండ్‌ జట్టు బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన 7 ఓవర్లలో కలిపి 120 పరుగులు రాగా... భారత బౌలర్లు కట్టడి చేసిన మిగతా 13 ఓవర్లలో 88 పరుగులే లభించాయి. ఓపెనర్లు కాన్వే (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సీఫెర్ట్‌ (13 బంతుల్లో 24; 5 ఫోర్లు) కలిసి 20 బంతుల్లోనే 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే కాన్వే 3 ఫోర్లు, 1 సిక్స్‌ బాది 18 పరుగులు రాబట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. 

అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. హర్షిత్‌ తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్‌’గా వేసినా... అతని తర్వాతి ఓవర్లో రచిన్‌ 2 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాదాడు. వరుణ్‌ ఓవర్లోనూ రెండు సిక్స్‌లతో రచిన్‌ జోరు కొనసాగించగా... కుల్దీప్‌ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన గ్లెన్‌ ఫిలిప్స్‌ (19) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మిచెల్‌ (18), రచిన్‌ పెవిలియన్‌ చేరడంతో కివీస్‌ స్కోరు వేగం మందగించింది. 

చాప్‌మన్‌ (10) కూడా విఫలమైనా, చివర్లో సాంట్నర్, ఫోక్స్‌ (15 నాటౌట్‌) ధాటిగా ఆడటంతో స్కోరు 200 దాటింది. చివరి 3 ఓవర్లలో వీరిద్దరు కలిసి 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో మొత్తం 47 పరుగులు రాబట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం.  

అభిషేక్‌ శర్మ ‘డకౌట్‌’ 
ఇన్నింగ్స్‌ రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా దానిని ఉపయోగించుకోలేక సామ్సన్‌ (6) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ (0) ఈసారి మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్య ఛేదన సులువుగా మారిపోయింది. ఫోక్స్‌ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిన ఇషాన్‌... సాంట్నర్‌ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హెన్రీ ఓవర్లోనూ వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

భారత్‌ చేసిన తొలి 100 పరుగుల్లో 76 అతని బ్యాట్‌ నుంచే వచ్చాయి. ఇషాన్‌ వెనుదిరిగిన తర్వాత సూర్య బాధ్యత తీసుకున్నాడు. భారత కెపె్టన్‌ చాలా కాలం తర్వాత అంచనాలకు తగిన ఆటను ప్రదర్శించాడు. ఫోక్స్‌ ఓవర్లో అతను వరుసగా 4, (వైడ్‌), 4, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి.  23 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్న సూర్య ఆ తర్వాత అదే ధాటిని చివరి వరకు కొనసాగించాడు. 

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్‌ 19; సీఫెర్ట్‌ (సి) ఇషాన్‌ (బి) వరుణ్‌ 24; రచిన్‌ (సి) అర్ష్ దీప్ (బి) కుల్దీప్‌ 44; ఫిలిప్స్‌ (సి) పాండ్యా (బి) కుల్దీప్‌ 19; మిచెల్‌ (సి) పాండ్యా (బి) దూబే 18; చాప్‌మన్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 10; సాంట్నర్‌ (నాటౌట్‌) 47; ఫోక్స్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–43, 2–43, 3–98, 4–125, 5–129, 6–161. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–53–0, పాండ్యా 3–0–25–1, హర్షిత్‌ 3–1–35–1, వరుణ్‌ 4–0–35–1, కుల్దీప్‌ 4–0–35–2, అభిషేక్‌ 1–0–12–0, దూబే 1–0–7–1.  

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రచిన్‌ (బి) హెన్రీ 6; అభిషేక్‌ (సి) కాన్వే (బి) డఫీ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) హెన్రీ (బి) సోధి 76; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 82; శివమ్‌ దూబే (నాటౌట్‌) 36; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–128. బౌలింగ్‌: హెన్రీ 3–0–41–1, డఫీ 4–0–38–1, ఫోక్స్‌ 3–0–67–0, సాంట్నర్‌ 2–0–27–0, సోధి 3–0–34–1, మిచెల్‌ 0.2–0–2–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement