Ind Vs WI: చార్టెడ్‌ ఫ్లైట్‌ లేదు.. ఆ విమానాల్లో వచ్చేయండి..! ఆ తర్వాత..

Ind Vs Wi: No Charter Flights For Indian Players All Come On Own Reports - Sakshi

Ind Vs Wi Series: దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం పాలైన టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. తొలుత అహ్మదాబాద్‌ వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లంతా ఫిబ్రవరి 1వ తారీఖున అహ్మదాబాద్‌కు చేరుకోవాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. వన్డే జట్టుకు ఎంపికైన క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం లేదని, ఎవరికివారుగా కమర్షియల్‌ ఫ్లైట్లలో అహ్మదాబాద్‌కు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. 

అయితే, వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత టీ20 సిరీస్‌ ఆడేందుకై చార్టెడ్‌ ఫ్లైట్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంగ్లండ్‌ టూర్‌ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ తదితర నగరాల నుంచి చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఆటగాళ్లను తీసుకువచ్చి ముంబైలో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు.

అయితే, ఈసారి ఇలాంటి ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించడం లేదని... అదే విధంగా కేవలం మూడు రోజులపాటే ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘యూకే టూర్‌ కోసం సన్నద్ధమైన మాదిరిగానే ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని భావించాం. కానీ కుదరడం లేదు.

టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సమా క్రికెటర్లు, సహాయక సిబ్బంది అందరూ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అక్కడే మూడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటారు. ​ కోవిడ్‌ నిర్దారణ పరీక్షల అనంతరం వన్డే సిరీస్‌ కోసం సన్నద్ధమవుతారు’’ అని పేర్కొన్నారు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఫిబ్రవరి 2న భారత్‌కు చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌లో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత ఇరుజట్లు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు చేరుకోనున్నాయి. అక్కడ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది.

చదవండి: India Test Captain: రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్‌ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్‌ అవసరమా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top