IND Vs WI: అయ్యర్‌పై వేటు.. రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్‌; తొలి వన్డేకు రాహుల్‌ దూరం

Rohit Sharma Returns Ravi Bishnoi Maiden Call-up Vs WI ODI-T20 Series - Sakshi

విండీస్‌తో సిరీస్‌కు భారత వన్డే, టి20 జట్ల ప్రకటన

ముంబై: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టి20ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ బుధవారం రాత్రి ప్రకటించింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్‌ శర్మ పూర్తి ఫిట్‌గా మారి జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌కు ఇదే తొలి సిరీస్‌ కానుంది. వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. రెండో వన్డే నుంచి అతను జట్టుతో కలుస్తాడు.

బుమ్రా, షమీలకు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించిన సెలక్షన్‌ కమిటీ... రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతని పేరును పరిశీలించలేదని స్పష్టం చేసింది. 18 మంది సభ్యుల చొప్పున రెండు జట్లను ప్రకటించారు. సిరీస్‌ భారత్‌లోనే ఉండటంతో స్టాండ్‌బైలను ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎలాంటి విరామం కోరుకోకుండా రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండటం విశేషం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడిన వెంకటేశ్‌ అయ్యర్‌పై వేటు వేసి టి20లకే పరిమితం చేశారు. వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి పునరాగమనం చేశాడు.

సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌కు రెండు టీమ్‌లలోనూ చోటు దక్కకపోగా... భువనేశ్వర్‌ను వన్డేల నుంచి తప్పించి టి20ల్లోకి మాత్రమే ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా గత కొంత కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేకపోయినా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రెండు జట్లలోనూ చూస్తే పూర్తిగా కొత్త ఆటగాళ్లు ముగ్గురు ఎంపికయ్యారు. లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్, పేసర్‌ అవేశ్‌ ఖాన్, ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాలకు భారత జట్టు తరఫున ఇదే తొలి అవకాశం. భారత్, విండీస్‌ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లో మూడు వన్డేలు... ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. 

వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్, శిఖర్‌ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, దీపక్‌ హుడా.  

టి20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, పంత్, వెంకటేశ్‌ అయ్యర్, దీపక్‌ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్, అక్షర్‌ పటేల్, సిరాజ్, హర్షల్‌ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్‌.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top