Ind Vs IRE Predicted Playing XI: రాహుల్‌ త్రిపాఠికి ఛాన్స్‌.. అర్ష్‌దీప్‌ ఎంట్రీ!

IND Vs IRE 2nd T20: India Predicted Playing XI Rahul Tripathi May Debut - Sakshi

India Vs Ireland T20 Series 2022: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ గెలిచిన టీమిండియా రెండో విజయంపై దృష్టి సారించింది. తమ పర్యటనలో భాగంగా పాండ్యా సేన ఆఖరి టీ20 గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. మొదటి మ్యాచ్‌ ఫలితాన్ని పునరావృతం చేసి సంపూర్ణ విజయంతో స్వదేశానికి తిరిగి రావాలని పట్టుదలగా ఉంది.

అయితే, ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని జట్టులో  ప్రయోగాలు చేసేందుకు మేనేజ్‌మెంట్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డబ్లిన్‌ వేదికగా మంగళవారం(జూన్‌ 28) జరుగనున్న రెండో టీ20లో రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

స్టార్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదన్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ దీపక్‌ హుడా ఇషన్‌ కిషన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశాడు. అయితే, ఓపెనర్‌గా రాణించగల సత్తా ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంతో హుడా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు.

కాగా రెండో మ్యాచ్‌లో కూడా అయ్యర్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైట్‌- లెఫ్ట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌తో వెళ్లాలని పాండ్యా భావిస్తే.. రాహుల్‌ త్రిపాఠి తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. త్రిపాఠి లేదంటే అనువజ్ఞుడైన సంజూ శాంసన్‌ ఇషాన్‌కు జోడీగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. 

అయితే, ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఐపీఎల్‌-2022లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. దీంతో అతడికి అవకాశం వస్తే మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాగా ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్‌ త్రిపాఠి 14 మ్యాచ్‌లలో మొత్తంగా 413 పరుగులతో సత్తా చాటాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

ఐర్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తిక్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.

మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ ప్రసారం?
రాత్రి గం.9 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3, 4లలో ప్రత్యక్ష ప్రసారం
మ్యాచ్‌ వేదిక: ది విలేజ్‌, డబ్లిన్‌.
చదవండి: Rohit Sharma Daughter: నాన్న రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు
IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్‌ ఎవరు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top