Ind Vs Eng: కోచ్‌, సహాయక సిబ్బంది లేకుండానే నాలుగో టెస్టు ఆడింది

Ind Vs Eng: Inzamam ul Haq Says India Played 4th Test Without Coach - Sakshi

Inzamam-ul-Haq supports India’s take on Manchester Test: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజాముల్‌ హక్‌ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడటం పట్ల భారత జట్టును తప్పుపట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా టీమిండియా అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌కు కరోనా సోకిన నేపథ్యంలో ఓవల్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో శుక్రవారం జరగాల్సిన నిర్ణయాత్మక మ్యాచ్‌ తాత్కాలికంగా రద్దైన విషయం తెలిసిందే. ఆటగాళ్లందరికీ కోవిడ్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చినప్పటికీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. 

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించిన ఇంజమాముల్‌ హక్‌.. టీమిండియా నిర్ణయం సరైనదేనని సమర్థించాడు.  ‘‘సహాయక సిబ్బంది లేకుండా మైదానంలో దిగడం ఎంతో కష్టం. ఎవరైనా వ్యక్తి గాయపడినా, అస్వస్థతకు గురైనా ట్రెయినర్లు, ఫిజియోల అవసరం ఉంటుంది. వారి సహాయంతో కోలుకుని తిరిగి మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంటుంది. 

ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లో ఓ రోజు ఆట ముగిసిన వెంటనే ఫిజియోల పని మొదలవుతుంది. మరుసటి రోజు ఆట కోసం వారిని సంసిద్దులను చేయాల్సి ఉంటుంది. ఫిజియోలు, ట్రెయినర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దురదృష్టవశాత్తూ ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు కోవిడ్‌ కారణంగా ఆగిపోయింది. నిజానికి ఇది చాలా గొప్ప సిరీస్‌. కోచ్‌, సహాయక సిబ్బంది లేకుండానే భారత జట్టు నాలుగో టెస్టు ఆడింది.

మైదానంలో వారు చూపిన ప్రతిభాపాటవాలు అసాధారణం. ఐదో మ్యాచ్‌ను నిరవధికంగా వాయిదా వేయడం సరైన నిర్ణయమే’’ అని  ఇంజమాముల్‌ హక్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఐదో టెస్టు రీషెడ్యూల్‌ విషయమై బీసీసీఐ- ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా నాలుగో టెస్టుకు ముందు బుక్‌లాంచ్‌కు హాజరైన హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇతర కోచ్‌లు భరత్‌ అరుణ్‌, శ్రీధర్‌ ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. 

చదవండి: Ind Vs Eng: కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top