
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానం వేదికగా గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉండడంతో.. లార్డ్స్‌లో టెస్టులో ఎలాగైనా గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
అందుకు తగ్గట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. అదేవిధంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్‌లో ఆడడం ఖాయమైంది.
అంతకుతోడు లార్డ్స్ మైదానంలో పచ్చికతో కూడిన వికెట్‌ను తాయారు చేయడంతో ఫాస్ట్ బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య గట్టి పోటీ నెలకోనుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
భయపెడుతున్న గత రికార్డులు..
ఈ మైదానంలో గత రికార్డులు భారత అభిమానులను భయపెడుతున్నాయి. లార్డ్స్‌లో ఇప్పటివరకు 19 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం మూడింట మాత్రమే గెలిచి 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 1986లో కపిల్‌దేవ్ నేతృత్వంలో లార్డ్స్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2014 లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది. అనంతరం చివరగా 2021లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచింది.
గిల్ మ్యాజిక్ చేస్తాడా..?
టీమిండియా లార్డ్స్‌లో చివరగా 2021లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్బుతం చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కోహ్లి సేన.. ఏడేళ్ల తర్వాత లార్డ్స్‌లో టెస్టు విజయాన్ని అందుకుంది. 272 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ను 120 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి తమ సత్తాను చాటింది.
ఇప్పుడు యువ సారథి శుబ్‌మన్ గిల్ వంతు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టు 2021 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. లార్డ్స్‌లో 2021 నాటి చారిత్రత్మక టెస్ట్ విజయంలో భాగమైన ఐదుగురు భారత ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కూడా ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ప్లేయర్లు అప్పుడు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ సీనియర్ ప్లేయర్లు తమ స్దాయికి తగ్గట్టు రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు చెమటలు పట్టక తప్పుదు.
ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్