
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (PC: BCCI)
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన తుదిజట్టులో మూడు మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ వరుసగా విఫలమవుతున్నాడన్న ఇర్ఫాన్ పఠాన్.. అతడిని పక్కకపెట్టక తప్పదన్నాడు.
కరుణ్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు చోటివ్వాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇంగ్లండ్ బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కోవడంలో అంతగా సఫలం కాలేకపోతున్నారని.. అందుకే సాయికి మరో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. అదే విధంగా.. అనివార్యమైన మరో రెండు మార్పుల గురించి కూడా ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు.
కరుణ్ నాయర్ బెంచ్ మీదే
ఈ మేరకు.. ‘‘కరుణ్ నాయర్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి అతడి అత్యధిక స్కోరు 40 మాత్రమే. అయితే, మంచి బంతులకే అతడు అవుటయ్యాడు.
ఒకవేళ అతడు పరుగులు రాబట్టడంలో సతమతమవుతున్నాడని భావిస్తే.. తప్పకుండా అతడిని బెంచ్‌కే పరిమితం చేయాలి. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించాలి. ఎందుకంటే అతడు ఎడమ చేతి వాటం బ్యాటర్. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టులను పరిశీలిస్తే ఇంగ్లండ్ బౌలర్లు లెఫ్టాండర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
వికెట్ కీపర్‌గా జురెల్
ఇక రిషభ్ పంత్ కూడా గాయపడ్డాడనే సమాచారం ఉంది. కాబట్టి అతడు ఈసారి కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ వస్తే.. బ్యాటింగ్ విభాగంగా మరింత పటిష్టం అవుతుంది.
భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతడు 90 పరుగులతో ఆకట్టుకున్న విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. వికెట్ కీపర్‌గా అతడు మరింత మెరుగుపడాలి.
అన్షుల్ వద్దు.. అతడే బెటర్
ఇక పేసర్ ఆకాశ్ దీప్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతడి ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా ఇప్పుడు ప్రసిద్ కృష్ణ జట్టులోకి వస్తాడు. అన్షుల్ కాంబోజ్ కూడా ఒకే. కానీ కీలక మ్యాచ్‌లో ప్రసిద్ కృష్ణనే ఆడిస్తే బెటర్. అతడి అనుభవం అక్కరకు వస్తుంది.
ఇక అర్ష్‌దీప్ సింగ్ గాయపడి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఎలా చూసినా ప్రసిద్‌కు లైన్ క్లియర్ అయినట్లే. అన్షుల్ కాంబోజ్ తుదిజట్టులో ఉంటే బాగుంటుంది. అతడి బౌలింగ్ శైలి నాకెంతో ఇష్టం.
కానీ ప్రస్తుతం అరంగేట్ర బౌలర్ కన్నా.. అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం ఉంది కాబట్టి.. నేను ప్రసిద్ వైపు మొగ్గుచూపుతాను’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్, ఆకాశ్ దీప్ ప్లేస్‌లో ప్రసిద్ కృష్ణను ఆడించాలన్న పఠాన్.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానాన్ని బ్యాటర్ ధ్రువ్ జురెల్‌తో భర్తీ చేయాలని సూచించాడు.
కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్ వేదిక.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్