
Update: నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 87(210), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 78(167)తో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే టీమిండియా 137 పరుగులు వెనుకబడి ఉంది.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరి పోరాట పటిమ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వంద పరుగుల మార్కు దాటింది. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నాలుగో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46)లు రాణించగా.. సాయి సుదర్శన్ (61), రిషభ్ పంత్ (54) అర్ధ శతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇందుకు దీటుగా బదులిచ్చి ఏకంగా 669 పరుగులు సాధించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94)లు బజ్‌బాల్‌తో దుమ్ములేపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (71) అద్భుత అర్థ శతకం సాధించాడు. జో రూట్ (150), కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) భారీ శతకాలు బాదారు
ఫలితంగా ఏకంగా 669 పరుగులు సాధించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. భారత రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.
ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి డకౌట్‌గా వెనుదిరిగారు.
టీమిండియా ఇన్నింగ్స్‌లో నాలుగో బంతికి జైసూను, ఐదో బంతిని సాయిని ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ వెనక్కి పంపించాడు. ఇలా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయన భారత జట్టును కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి గిల్ 71, రాహుల్ 68 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.