Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్‌సెట్‌ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే..

Ind Vs Eng 2nd ODI: RP Singh On India Weakness They Have To Change Mindset - Sakshi

టీమిండియా టాపార్డర్‌పై ఆర్పీ సింగ్‌ విమర్శలు

India Vs England ODI Series 2022- 2nd ODI : టీమిండియా బ్యాటర్లు తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని భారత మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ సూచించాడు. వన్డే ఫార్మాట్‌లో ప్రతిసారి భారీ షాట్లకు యత్నిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ పిచ్‌లపై టాపార్డర్‌ మెరుగ్గా రాణించాల్సి ఉంటుందని.. టెయిలెండర్లపై భారం వేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

బౌలర్లు ఫర్వాలేదు!
కాగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ సేనకు.. ఇంగ్లండ్‌ 247 పరుగులు లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు, మహ్మద్‌ షమీ ఒకటి, ప్రసిద్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు. 

ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. యజువేంద్ర చహల్‌ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం 9 పరుగులకే నిష్క్రమించాడు.

టాపార్డర్‌ కకావికలం
ఇక విరాట్‌ కోహ్లి 16 పరుగులుకే పెవిలియన్‌ చేరగా.. రిషభ్‌ పంత్‌ పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ 27, హార్దిక్‌ పాండ్యా 29, రవీంద్ర జడేజా 29 పరుగులతో రాణించి ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో షమీ 23 పరుగులు సాధించగా.. బుమ్రా రెండు పరుగులతో అజేయంగా నిలిచాడు. చహల్‌, ప్రసిద్‌ వరుసగా 3,0 స్కోర్‌ చేశారు.

తప్పంతా వాళ్లదే!
ఇలా టాపార్డర్‌ ఘోరంగా విఫలం కావడంతో టీమిండియాకు వంద పరుగుల తేడాతో ఘోర పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుపై ఆర్పీ సింగ్‌ క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘‘వన్డేలు ఆడేటపుడు భారత బ్యాటర్లు తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలి. ప్రతి బాల్‌ను అటాక్‌ చేస్తూ భారీ షాట్లు కొడతామంటే కుదరదు. ప్రతిసారి ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు. 

చివరిదాకా ఇన్నింగ్స్‌ కొనసాగించాలి. ఇంగ్లండ్‌ గడ్డపై టెయిలెండర్లకు బ్యాటింగ్‌ అంత తేలికేమీ కాదు. మూడో వన్డేలో ఇండియాను గెలిపించే బాధ్యత టాపార్డర్‌ మీదే ఉంది’’ అని టీమిండియా మాజీ బౌలర్‌ ఆర్పీ సింగ్‌ పేర్కొన్నాడు. మూడో వన్డేలో ఓడి సిరీస్‌ చేజారితే గనుక బ్యాటర్లదే బాధ్యత అని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

ఓపెనర్లు, టాపార్డర్‌ విఫలమైతే.. మ్యాచ్‌ గెలవడం కష్టమని.. మొదటి వన్డేలో ఇంగ్లండ్‌కు అందుకే పరాజయం ఎదురైందని.. ఇప్పుడు భారత్‌ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపాడు. రెండో వన్డేలో టీమిండియాకు ఇంగ్లండ్‌ అంత పెద్ద లక్ష్యమేమీ విధించలేదన్న ఆర్పీ సింగ్‌.. ఇది పూర్తిగా బ్యాటర్ల వైఫల్యమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఇరుజట్ల మధ్య ఆదివారం(జూలై 17) మాంచెస్టర్‌ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.

చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా..
Jos Buttler- Virat Kohli: కోహ్లి ఆట తీరుపై విమర్శలు.. బట్లర్‌ ఘాటు వ్యాఖ్యలు! అతడు కూడా మనిషే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top