Ind Vs Ban: చెత్త బ్యాటింగ్‌.. రోహిత్‌ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్‌

Ind Vs Ban 2nd ODI Kaif Warning To Rohit Kuldeep Should Played 3 - Sakshi

India tour of Bangladesh, 2022- Bangladesh vs India: టీమిండియా బ్యాటర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ మండిపడ్డాడు. బౌలర్లను తప్పుబట్టడం సరికాదని.. చెత్త బ్యాటింగ్‌ వల్లే బంగ్లాదేశ్‌ చేతిలో రోహిత్‌ సేన ఓడిపోయిందని పేర్కొన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న కైఫ్‌,.. ఇకనైనా ‘హిట్‌మ్యాన్‌’ బ్యాట్‌ ఝులిపించాలని సూచించాడు.

బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా ఆదివారం నాటి తొలి వన్డేలోనే భారత్‌కు పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(27) సహా సీనియర్లు శిఖర్‌ ధావన్‌(7), విరాట్‌ కోహ్లి(9) విఫలమయ్యారు. వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే అర్ధ శతకం(73 పరుగులు)తో రాణించడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గౌరవప్రదమైన(186) స్కోరు చేయగలిగింది.

అయితే, భారత బౌలర్లు ఫర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్య ఛేదనలో బంగ్లాను మెహదీ, ముస్తాఫిజుర్‌ ఆదుకోవడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లు.. ముఖ్యంగా రోహిత్‌ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చెత్తగా ఆడారు..
ఇక బుధవారం ఇరు జట్లు రెండో వన్డేలో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్‌ షోలో పాల్గొన్న మహ్మద్‌ కైఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మనం ఎక్కువగా భారత బౌలింగ్‌ విభాగం గురించి మాట్లాడుతున్నాం.

నిజానికి మొదటి వన్డేలో బ్యాటర్లు చెత్తగా ఆడారు. కేవలం బ్యాటింగ్‌ వైఫల్యం వల్లే టీమిండియా ఓడిపోయింది. విరాట్‌ కోహ్లి పరుగులు సాధించాలి. ముఖ్యంగా కెప్టెన్‌.. రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావాలి. గత కొంతకాలంగా తన వైఫల్యం కొనసాగుతోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు’’ అని కైఫ్‌.. రోహిత్‌ తీరును విమర్శించాడు.

కుల్దీప్‌ను అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి..
ఇక రెండో వన్డే నేపథ్యంలో.. యువ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌కు కైఫ్‌ మద్దతుగా నిలిచాడు. అతడిని సిరీస్‌ మొత్తం ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ‘‘ఒకవేళ వాళ్లు రెండో వన్డేకు తుది జట్టులో మార్పులు చేయాలనుకుంటే..  గందరగోళం ఏర్పడుతుంది.

యువ ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటే కచ్చితంగా కుల్దీప్‌ సేన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వాలి. తను మొదటి వన్డేతో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. అయితే, పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. తన బౌలింగ్‌లో పేస్‌ ఉంది. కానీ ఒత్తిడిలో కూరుకుపోవడం వల్ల సరిగ్గా ఆడలేకపోయాడు.

అయినా, తనకిది మొదటి మ్యాచ్‌. కాబట్టి మరో అవకాశం ఇవ్వాలి. నిజానికి ఒక్క మ్యాచ్‌ ఓడితే జట్టులో మార్పులు చేయడం సరికాదు. అలా చేస్తే ఆ జట్టు కెప్టెన్‌ లేదంటే సరైన వాళ్లు అనిపించుకోరు’’ అంటూ యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌కు మాజీ బ్యాటర్‌ కైఫ్‌ అండగా నిలబడ్డాడు. కాగా మొదటి వన్డేలో 5 ఓవర్లు బౌల్‌ చేసిన కుల్దీప్‌ సేన్‌ 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం!
Hasan Ali: హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్‌ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top