కోహ్లి- జైస్వాల్ (PC: BCCI)
అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
కొత్త టీ20 కెప్టెన్
కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్‌తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.
కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదు
ఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్‌డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
కోహ్లి స్థానంలో అతడే
అదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను అఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ సంగతేంటి?
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్‌డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.
మరోవైపు.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.
అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేటెడ్)
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్‌నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్‌నెస్ ఆధారంగా).
షెడ్యూల్
జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు.
చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు


