ICC T20 Rankings: పాపం సూర్య.. నెంబర్‌ 1 కాలేకపోయాడు! అదరగొట్టిన రవి బిష్ణోయి! ఏకంగా..

ICC T20 Rankings: Suryakumar Not No 1 Ravi Bishnoi Jumps 50 Places - Sakshi

ICC Batting And Bowling T20 Rankings: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడికి చేరువగా వచ్చిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ తాజా ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌కు సూర్యకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆడి మంచి స్కోరు నమోదు చేసి ఉంటే సూర్య.. నంబర్‌ 1గా నిలిచేవాడు. కానీ.. అలా జరుగలేదు.

టాప్‌-5లో..
ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 805 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. బాబర్‌ ఆజం 818 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకున్నాడు. ఇక వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా), డేవిడ్‌ మలాన్‌(ఇంగ్లండ్‌) నిలిచారు.

ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌లో మొత్తంగా 115 పరుగులు సాధించిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌.. 66వ స్థానం నుంచి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు.


రవి బిష్ణోయి

అదరగొట్టిన రవి బిష్ణోయి.. టాప్‌-50లోకి..
ఐసీసీ టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయి దుమ్ములేపాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతడు ఏకంగా టాప్‌-50లోకి చేరుకున్నాడు. 481 పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ 44వ ర్యాంకు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అద్బుతంగా(6 వికెట్లు) రాణించినప్పటికీ.. విండీస్‌ బౌలర్‌ ఒబెడ్‌ మెకాయ్‌ 28వ స్థానం నుంచి 35వ స్థానానికి పడిపోయాడు.

ఇక టీమిండియా పేసర్‌ హర్షల్‌ పటేల్‌ విషయానికొస్తే.. ఒక స్థానం దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. మరో ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్నది వీళ్లే!
1.బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 818 పాయింట్లు
2. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 805 పాయింట్లు
3.మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)- 794 పాయింట్లు
4.ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)- 792 పాయింట్లు
5.డేవిడ్‌ మలాన్‌(ఇంగ్లండ్‌)- 731 పాయింట్లు
6. ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు
7.పాథుమ్‌ నిశాంక(శ్రీలంక)-661 పాయింట్లు
8.డెవాన్‌ కాన్వే(న్యూజిలాండ్‌)- 655 పాయింట్లు
9.నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌)-644 పాయింట్లు
10. మార్టిన్‌ గఫ్టిల్‌(న్యూజిలాండ్‌)-638 పాయింట్లు
చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్‌ స్కోరర్లను వదిలేసి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top