
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు. కానీ అతడికి రెండుసార్లు లక్ తగిలింది. ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసిందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుని సెకండ్ చాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఈ అవకాశాన్ని కూడా జారవిచుకునే పరిస్థితిలో నిలిచాడు. అతడు ఎవరో కాదు టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్. ఊహించని విధంగా టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన ఈ విదర్భ క్రికెటర్.. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంతో అతడిని టీమ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు రోజురోజుకు అధికమవుతున్నాయి.
బ్యాటింగ్ భారం మోస్తాడనుకుంటే..
33 ఏళ్ల కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపికై తన పునరాగమాన్ని ఘనంగా చాటాడు. 3006 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి సెలెక్టర్ల కంట్లో పడడడంతో ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ నేపథ్యంలో బ్యాటింగ్ భారాన్ని మోస్తాడన్న భరోసాతో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. అయితే గత 2 టెస్టుల్లో అతడి తీరు స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 40 పరుగులు సాధించాడు. 5 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇన్నింగ్స్‌లో శుబమన్ గిల్ 601 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీని బట్టే చూస్తే కరుణ్ ఎంతగా విఫలమయ్యాడన్నది అర్థమవుతుంది.
ఇలాగైతే కష్టమే..
మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కరుణ్ ఆటతీరు ఇలాగే కొనసాగితే జట్టులో అతడి స్థానం గల్లంతయ్యే అవకాశం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయితే ముప్పు తప్పదని చతేశ్వర్ పూజారా (cheteshwar pujara) అభిప్రాయపడ్డాడు. భారీ స్కోరు చేయడంలో కరుణ్ విఫలమవుతున్నాడని, అనవసర తప్పిదాలతో వికెట్ పారేసుకుంటున్నారని పూజారా వ్యాఖ్యానించాడు. రెండంకెల స్కోరును భారీ స్కోరుగా మలచడానికి అతడు ప్రయత్నం చేయాలని సూచించాడు. క్రీజులోనే పాతుకుపోవడం ద్వారా తప్పిదాలకు ఆస్కారం కలుగుతోందని విశ్లేషించాడు. బ్యాక్‌ఫుట్ చురుగ్గా కదపడం ద్వారా పరుగులు సాధించొచ్చని సలహాయిచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కరుణ్ ఎక్కువ స్కోరు చేస్తాడన్న ఆశాభావాన్ని పూజారా వ్యక్తం చేశాడు. కరుణ్ లాంటి బ్యాటర్‌కు సిరీస్‌లో తనదైన ముద్ర వేయడానికి ఆరు ఇన్నింగ్స్‌లు సరిపోతాయని వ్యాఖ్యానించాడు.
చదవండి: అతడిని నాలుగో టెస్టులోనూ ఆడించాల్సిందే
కరుణ్ ప్లేస్‌లో ఎవరు?
తర్వాతి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తాడనే దానిపై కరుణ్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అతడి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మొదటి టెస్ట్‌లో బాగానే ఆడినప్పటికీ జట్టులో స్థానం కోల్పోయిన యువ ఆటగాడు సాయి సుదర్శన్ మళ్లీ చోటు దక్కించుకోవడానికి వేచిచూస్తున్నాడు. మరో టాలెంటెడ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా జట్టులో స్థానం సంపాదించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధ సెంచరీలతో సహా 227 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కూడా రేసులో ఉన్నాడు. కాబట్టి కరుణ్‌కు ఇది పరీక్షా సమయం. తనకు స్థాయికి తగినట్టు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టులో అతడి చోటుకు భరోసా ఉంటుంది. లేకపోతే పునరాగమనం మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. చూద్దాం నాయర్ ఏం చేస్తాడో!