 
															Photo Courtesy: BCCI
తొలుత అంపైర్ క్యామ్.. తర్వాత స్పైడర్ క్యామ్.. ఇప్పుడు ‘చంపక్’.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన కొత్త మెంబర్ పేరిది. ఐపీఎల్-2025 సీజన్ సందర్భంగా ఓ రోబో కుక్కను నిర్వాహకులు ప్రవేశపెట్టారు.
ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏప్రిల్ 13న ఈ రోబో కుక్కను.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డానీ మోరిసన్ పరిచయం చేశాడు. తమ జట్టులోని కొత్త మెంబర్ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲'𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻 👀
It can walk, run, jump, and bring you a 'heart(y)' smile 🐩❤️
And...A whole new vision 🎥
Meet the newest member of the #TATAIPL Broadcast family 👏 - By @jigsactin
P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV— IndianPremierLeague (@IPL) April 13, 2025
ఇక వాంఖడేలో ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్‌మధ్య ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా దీనికి ‘చంపక్’గా నామకరణం చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోబో కుక్కను రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో చెన్నైపై విజయానంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ‘చంపక్’ను కలిశాడు.
ఆ సమయంలో ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ హార్దిక్ పక్కనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆకాశ్‌ను ఆటపట్టించేందుకు రోబో కుక్కను అతడి మీదకు ఉరికించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయి ఆకాశ్ అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేయగా.. హార్దిక్ గట్టిగా నవ్వేశాడు.
— Epic Comments Telugu (@epicmntstelugu) April 21, 2025
అనంతరం చంపక్‌తో ఆకాశ్‌కు షేక్‌హ్యాండ్ ఇప్పించిన హార్దిక్.. ఆ తర్వాత అతడి ముందు రోబో డాగ్ సాగిలాపడేలా రిమోట్‌తో ఆపరేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే ‘చంపక్’ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కలిశారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32) అరంగేట్రంలోనే మెరుపులు మెరిపించగా.. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివం దూబే (50) అర్ధ శతకాలు సాధించారు.
ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు కూల్చగా.. అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 15.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి పని పూర్తి చేసింది.
ఓపెనర్లలో రియాన్ రికెల్టన్ (24) ఓ మోస్తరుగా ఆడగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దంచికొట్టారు. రోహిత్ 45 బంతుల్లో 76.. సూర్య 30 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై విజయాన్ని ఖరారు చేశారు. ఈ సీజన్‌లో ముంబై ఇప్పటికి ఎనిమిదింట నాలుగు గెలిచి పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. చెన్నై ఎనిమిది మ్యాచ్‌లకు గానూ రెండే గెలిచి ఆఖరున పదో స్థానంలో కొనసాగుతోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
