దోహా: ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీకి అనూహ్య పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన నాకౌట్ దశ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పంకజ్ అద్వానీ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చైనా ప్లేయర్ డెంగ్ హావోహుయ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ 1–4 (24–66, 38–71, 11–62, 79–46, 42–70) ఫ్రేమ్‌ల తేడాతో ఓటమి చవిచూశాడు.
అంతకుముందు గ్రూప్ ‘హెచ్’ లో పంకజ్ రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందాడు. మొత్తం 12 గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 24 మంది ప్లేయర్లు నాకౌట్ దశకు చేరుకున్నారు.
భారత్ కే చెందిన హుస్సేన్ ఖాన్ మాత్రం నాకౌట్ దశ తొలి మ్యాచ్‌లో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత పొందాడు. నాకౌట్ మ్యాచ్‌లో హుస్సేన్ 4–3 (73–49, 59–30, 68–73, 36–48, 60–14, 44–59, 85–37) ఫ్రేమ్‌ల తేడాతో హసన్ కెర్డె (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు.
అనాహత్ శుభారంభం
న్యూఢిల్లీ: చైనా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ శుభారంభం చేసింది. షాంఘైలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అనాహత్ 11–6, 11–8, 11–3తో మెనా హమీద్ (ఈజిప్ట్)పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు అభయ్ సింగ్, వెలవన్ సెంథిల్ కుమార్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. అభయ్ 8–11, 7–11, 4–11తో బాప్టిస్ట్ మసోట్టి (ఫ్రాన్స్) చేతిలో, సెంథిల్ కుమార్ 8–11, 12–14, 6–11తో మొహమ్మద్ అబూఎల్గర్ (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయారు.


