ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు
దోహా: అంచనాలకు మించి రాణించిన భారత స్నూకర్ ప్లేయర్ అనుపమ రామచంద్రన్ తన కెరీర్‌లోనే అతిగొప్ప విజయాన్ని అందుకుంది. అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో (15 రెడ్) తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల అనుపమ విజేతగా అవతరించింది.
గురువారం జరిగిన ఫైనల్లో అనుపమ 3–2 (51–74, 65–41, 10–71, 78–20, 68–60) ఫ్రేమ్‌ల తేడాతో ఎన్జీ ఆన్ యీ (హాంకాంగ్)పై విజయం సాధించింది. తద్వారా ప్రపంచ స్నూకర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గతంలో భారత్‌కు చెందిన అమీ కమాని (2016లో), విద్యా పిళ్లై (2022లో) ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచారు.
అనుపమ మాత్రం తొలి ప్రయత్నంలోనే ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజా ఓటమితో 34 ఏళ్ల ఎన్జీ ఆన్ యీ నాలుగోసారి ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. 2012 ఫైనల్లో వెండీ జాన్స్ (బెల్జియం) చేతిలో... 2023 ఫైనల్లో బాయ్ యులు (చైనా) చేతిలో... 2024 ఫైనల్లో ప్లాయ్‌చోంపో (థాయ్‌లాండ్) చేతిలో ఎన్జీ ఆన్ యీ ఓడిపోయింది. అయితే ఎన్జీ ఆన్ యీ గతంలో మూడుసార్లు (2009, 2010, 2019) ప్రపంచ స్నూకర్ చాంపియన్‌గా నిలవడం విశేషం.


