నార్వే చెస్‌ టోర్నీ.. గుకేశ్‌కు తొలి విజయం | Gukesh beats Nakamura to earn three points in Norway Chess | Sakshi
Sakshi News home page

నార్వే చెస్‌ టోర్నీ.. గుకేశ్‌కు తొలి విజయం

May 30 2025 1:46 PM | Updated on May 30 2025 3:13 PM

Gukesh beats Nakamura to earn three points in Norway Chess

స్టావెంజర్‌: వరల్డ్‌ చెస్‌ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ తన 19వ పుట్టిన రోజున కీలక గెలుపును తనకు తాను బహుమతిగా ఇచ్చుకున్నాడు. నార్వే చెస్‌ టోర్నమెంట్‌ తొలి రెండు రౌండ్‌లలో పరాజయం చవిచూసిన అతను మూడో రౌండ్‌లో గెలుపు నమోదు చేశాడు. 

హికారు నకముర (అమెరికా)తో గురువారం జరిగిన పోరులో గుకేశ్‌ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. టోర్నీ తొలి రౌండ్‌లో కార్ల్‌సన్, రెండో రౌండ్‌లో అర్జున్‌ ఇరిగేశి చేతిలో గుకేశ్‌ ఓటమిపాలయ్యాడు. గత రెండు పరాజయాలను మరచి ఒక కొత్త టోర్నీ తరహాలో ఈ రౌండ్‌ను మొదలు పెట్టానని, విజయం దక్కడం సంతోషంగా ఉందని గుకేశ్‌ వ్యాఖ్యానించాడు. మరో వైపు ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో అర్జున్‌ ఇరిగేశి పరాజయం పాలవగా...వీ యి (చైనా) చేతిలో అనూహ్యంగా మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. 

మూడు రౌండ్‌ల తర్వాత కరువానా అగ్రస్థానంలో ఉండగా, అర్జున్‌ రెండో స్థానంలో ఉన్నాడు.  మరో వైపు మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో హంపి...సారా ఖదమ్‌ (స్పెయిన్‌)పై గెలుపొందింది. మరో పోరులో జు వెన్‌ జున్‌ (చైనా)...భారత్‌కు చెందిన వైశాలిపై విజయం సాధించింది.    

Advertisement
 
Advertisement
Advertisement