టైటాన్స్‌ ఏడో గెలుపు.. రైజర్స్‌ ఏడో ఓటమి | Gujarat beat Hyderabad by 38 runs | Sakshi
Sakshi News home page

IPL 2025: టైటాన్స్‌ ఏడో గెలుపు.. రైజర్స్‌ ఏడో ఓటమి

May 3 2025 3:12 AM | Updated on May 3 2025 9:24 AM

Gujarat beat Hyderabad by 38 runs

హైదరాబాద్‌ ‘ప్లే ఆఫ్స్‌’ ఆశలకు దెబ్బ!

38 పరుగులతో గుజరాత్‌ విజయం

గిల్, బట్లర్‌ అర్ధ సెంచరీలు 

ఐపీఎల్‌లో గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‘ప్లే ఆఫ్స్‌’ వెళ్లే అవకాశాలకు దాదాపు తెరపడినట్లే! హైదరాబాద్‌ జట్టు అధికారికంగా ఇంకా నిష్క్రమించకపోయినా ఏడో ఓటమితో సమీకరణాలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి. ఆశలు నిలవాలంటే గుజరాత్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో గిల్, బట్లర్, సుదర్శన్‌ బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసిన టైటాన్స్‌ దానిని నిలబెట్టుకుంది. ఏడో విజయంతో గుజరాత్‌ మరో మెట్టు పైకెక్కి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.   

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌ 2–0తో పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్‌ 38 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48; 9 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. అభిషేక్‌ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు.  

పరుగుల వరద... 
తొలి 2 ఓవర్లలో 16 పరుగులతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా మొదలైంది. అయితే తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లో సుదర్శన్‌ 5 ఫోర్లతో (4, 0, 4, 4, 4, 4) చెలరేగిపోగా, కమిన్స్‌ ఓవర్లో గిల్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. హర్షల్‌ ఓవర్లోనూ సుదర్శన్‌ 4 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్‌ 82 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఐపీఎల్‌లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. తొలి వికెట్‌కు గిల్‌తో 41 బంతుల్లోనే 87 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్‌ వెనుదిరిగాడు. 

ఆ తర్వాత 25 బంతుల్లో గిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు బట్లర్‌ కూడా దూకుడు కనబర్చాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అన్సారీ ఓవర్లో 6, 4 కొట్టిన బట్లర్‌ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఉనాద్కట్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన గుజరాత్‌...3 వికెట్లు కోల్పోయింది.  

అభిషేక్‌ పోరాటం వృథా... 
భారీ ఛేదనలో తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశాక ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అభిషేక్‌ ‌ సిక్సర్లతో ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. ఇషాన్‌ కిషన్‌ (13) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా, అభిషేక్‌కు క్లాసెన్‌ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) సహకరించాడు. 28 బంతుల్లోనే అభిషేక్‌ ‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 

అభిషేక్‌ , క్లాసెన్‌ మూడో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేసినా... చేయాల్సిన రన్‌రేట్‌ పైపైకి వెళ్లడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 31 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో అభిషేక్‌ ‌ అవుట్‌ కాగా... మరో మూడు బంతులకే క్లాసెన్‌ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌ (10 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని షాట్లు ఆడినా అది సరిపోలేదు.  

స్కోరు వివరాలు  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (సి) క్లాసెన్‌ (బి) అన్సారీ 48; గిల్‌ (రనౌట్‌) 76; బట్లర్‌ (సి) అభిషేక్‌ ‌ (బి) కమిన్స్‌ 64; సుందర్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) ఉనాద్కట్‌ 21; షారుఖ్‌ (నాటౌట్‌) 6; తెవాటియా (సి) అనికేత్‌ (బి) ఉనాద్కట్‌ 6; రషీద్‌ (సి) అండ్‌ (బి) ఉనాద్కట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–87, 2–149, 3–206, 4–218, 5–224, 6–224. బౌలింగ్‌: షమీ 3–0–48–0, ఉనాద్కట్‌ 4–0–35–3, కమిన్స్‌ 4–0–40–1, హర్షల్‌ 3–0–41–0, అన్సారీ 4–0–42–1, కమిందు 2–0–18–0.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ 20; అభిషేక్‌ ‌ (సి) సిరాజ్‌ (బి) ఇషాంత్‌ 74; ఇషాన్‌ కిషన్‌ (సి) ప్రసిధ్‌ (బి) కొయెట్జీ 13; క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిధ్‌ 23; అనికేత్‌ (సి) షారుఖ్‌ (బి) సిరాజ్‌ 3; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 21; కమిందు (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 0; కమిన్స్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–49, 2–82, 3–139, 4–141, 5–145, 6–145, బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–33–2, ఇషాంత్‌ 3.2–0–35–1, ప్రసిధ్‌ 4–0–19–2, కొయెట్జీ 4–0–36–1, సుందర్‌ 1–0–6–0, రషీద్‌ 3–0–50–0, సాయికిషోర్‌ 0.4–0–1–0.   

ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు  X  చెన్నై   
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement