పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్‌: భజ్జీ | Gary Kirsten Urged To Quit As Pakistan Head Coach And Come Back to India by Harbhajan Singh | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ను వీడి.. ఇండియా హెడ్‌కోచ్‌గా వచ్చెయ్‌: భజ్జీ

Published Wed, Jun 19 2024 12:10 PM | Last Updated on Wed, Jun 19 2024 2:57 PM

Gary Kirsten Urged To Quit As Pakistan Head Coach Come Back to India by Harbhajan

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్‌స్టన్‌కు తొలి మెగా టోర్నీలోనే చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌-2024లో పాక్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

ఆతిథ్య అమెరికా, చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓడి పరాభవాన్ని మూటగట్టుకుంది. గ్రూప్‌-ఏలో మిగిలిన కెనడా, ఐర్లాండ్‌లపై గెలిచినా సూపర్‌-8 రేసులో అమెరికాతో పోటీ పడలేక ఇంటిబాట పట్టింది.

గత టీ20 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన బాబర్‌ ఆజం ఈసారి ఇలా పూర్తిగా విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్‌- షాహిన్‌ ఆఫ్రిది మధ్య విభేదాలతో జట్టు రెండుగా చీలిందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్‌ సైతం జట్టులో ఐక్యత లోపించినందు వల్లే ఇలాంటి చెత్త ఫలితాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ఎన్నో జట్లకు మార్గదర్శనం చేశానని.. అయితే, ఇంత చెత్త జట్టును చూడలేదని గ్యారీ మండిపడినట్లు తెలుస్తోంది.

టీమిండియా కోచ్‌గా వచ్చెయ్‌
ఈ క్రమంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. పాక్‌ను వదిలేసి కిర్‌స్టన్‌ ఇండియా హెడ్‌ కోచ్‌గా రావాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘అనవసరంగా నీ సమయాన్ని అక్కడ వృథా చేసుకోకు గ్యారీ.

టీమిండియా కోచ్‌గా వచ్చెయ్‌. గ్యారీ కిర్‌స్టెన్‌.. అరుదైన వజ్రం, గొప్ప కోచ్‌లలో ఒకడు. మెంటార్‌, నిజాయితీ గల వ్యక్తి.. అంతేకాదు 2011 వరల్డ్‌కప్‌ గెలిపించిన కోచ్‌.

2011 నాటి జట్టులో అందరికీ ప్రియమైన స్నేహితుడు కూడా! గ్యారీ ప్రత్యేకమైన వ్యక్తి’’ అని భజ్జీ ఎక్స్‌ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ వైరల్‌ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

గౌతం గంభీర్‌ పేరు ఖరారు!
ఇప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ పేరు ఖరారు కాగా.. భజ్జీ ఇలా పోస్ట్‌ పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. గంభీర్‌ను వ్యతిరేకిస్తూ.. విదేశీ కోచ్‌ వైపే మొగ్గుచూపాలని బీసీసీఐకి సంకేతాలు ఇస్తున్నాడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా సౌతాఫ్రికా మాజీ బ్యాటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ గతంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో 2011లో భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలిచినపుడు అతడే కోచ్‌గా ఉన్నాడు. ఇక భజ్జీతో పాటు గంభీర్‌ కూడా ఈ జట్టులో సభ్యుడన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌-2024లో భారత జట్టు సూపర్‌-8కు చేరింది. ఇందులో భాగంగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్‌
ఆడనుంది.

చదవండి: Suryakumar Yadav: వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement