
లండన్‌లోని ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావల్సిన నేపథ్యంలో సిరాజ్ బంతితో ప్రత్యర్ధి జట్టును బోల్తా కొట్టించాడు.
చివరి రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ 8 వికెట్లు సాధించాడు.
కాగా ఓవల్‌లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సమం చేస్తుందని తనకు ముందే తెలుసని టీమిండిమా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు.
"నాలుగవ రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని గంగూలీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్కంఠపోరులో విజయం తర్వాత భారత జట్టును కొనియాడుతూ గంగూలీ ఓ ట్విట్ కూడాచేశాడు.
"అసాధారణ సిరీస్. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, సిరాజ్... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు" దాదా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్