
కోహ్లి, అగార్కర్‌లతో గంభీర్ (పాత ఫొటో)
పుజారాతో గౌతం గంభీర్
ఆటగాడిగా కంటే కోచ్‌గా ఉండటం అత్యంత కష్టమైన పని అని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) అన్నాడు. జట్టులోని ప్లేయర్‌గా కేవలం మన ఆటకు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అదే శిక్షకుడిగా ఉంటే జట్టులోని అందరి ఆటగాళ్ల ప్రదర్శనకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
అందువల్ల కోచ్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని.. అందుకే తాను ఈ మధ్య తరచుగా తన గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మార్గదర్శనంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత.. అతడి స్థానంలో గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
వన్డే, టీ20లలో రైట్ రైట్
శ్రీలంకలో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా తన కోచింగ్ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిన గౌతీ.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో వరుస విజయాలు చవిచూశాడు. ముఖ్యంగా అతడి నేతృత్వంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గడం చెప్పుకోదగినది.
టెస్టులలో బ్రేకులు
అయితే, టెస్టు ఫార్మాట్లో మాత్రం గంభీర్‌కు కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా తొలిసారి 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)ని పదేళ్ల తర్వాత చేజార్చుకోవడం.. గంభీర్‌పై విమర్శలకు దారితీశాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇంగ్లండ్ టూర్‌కు వచ్చిన గంభీర్‌కు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవమే మిగిలింది. లీడ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోయింది. అయితే, గత చేదు జ్ఞాపకాలు చెరిపేసేలా తొలిసారి ఎడ్జ్‌బాస్టన్‌లో జయభేరి మోగించింది. దీంతో గంభీర్‌కు కాస్త ఊరట లభించింది.
తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోంది
ఈ నేపథ్యంలో సహచర మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గతంలో కంటే ఇప్పుడు తరచుగా గడ్డానికి రంగు వేయాల్సి వస్తోంది.
ఆటగాడిగా ఉన్నపుడు మన ఆట గురించి మాత్రమే ఆలోచిస్తాం. అదే కోచ్‌గా మారితే.. జట్టు మొత్తానికి మనదే బాధ్యత. ప్రతి విషయానికి మనమే జవాబుదారీగా ఉండాలి. ఎలాంటి వ్యక్తిగత, ప్రత్యేక ఎజెండాలు లేకుండా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలి.
అయితే, కోచ్‌గా ఉండటం వల్ల అభద్రతా భావం మాత్రం ఎప్పుడూ దరిచేరదు. జట్టుతో కలిసే మనం నేర్చుకుంటాం. వారితో కలిసే ఎదుగుతాము. ఏదేమైనా ప్రతిరోజూ ఓ కొత్త సవాలే.
గంభీర్ ఎవరికీ ముఖ్యం కాదు
దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. ఇక్కడ గౌతం గంభీర్ అనే వ్యక్తి ముఖ్యం కాదు. భారత క్రికెట్ అనేదే అన్నింటికంటే ముఖ్యమైనది. డ్రెసింగ్‌రూమ్‌లో తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. వారి అభిప్రాయాలు కోచ్‌గా నాకూ ముఖ్యమే. ఏదేమైనా ఆటగాడిగా ఉండటం కంటే కోచ్‌గా కష్టతరమైన పనే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ప్యాట్ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్ రెడ్డి