గంభీర్‌ ఇక్కడే!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్‌కోచ్‌! | Gambhir To Be Replaced As Head Coach Zimbabwe Tour Asian Games | Sakshi
Sakshi News home page

గంభీర్‌ ఇక్కడే ఉంటాడు!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్‌కోచ్‌!

Jul 7 2026 1:14 PM | Updated on Jul 7 2026 2:13 PM

Gambhir To Be Replaced As Head Coach Zimbabwe Tour Asian Games

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది శ్రేయస్‌ అయ్యర్‌ సేన. తొలి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్‌ జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

జింబాబ్వే పర్యటనకు
ఇక టీ20 సిరీస్‌ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగం కానుంది. అనంతరం భారత టీ20 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు- 2026 టోర్నీలో పాల్గొంటుంది. అదే సమయంలో టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో కోచింగ్‌ సిబ్బందిలో బీసీసీఐ మార్పులు చేయనున్నట్లు సమాచారం. జర్నలిస్టు గౌరవ్‌ గుప్తా సోషల్‌ మీడియా వేదికగా అందించిన సమాచారం ప్రకారం.. జింబాబ్వే టూర్‌, ఆసియా క్రీడల్లో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ బదులు.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత జట్టుకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది.

గంభీర్‌ ఇక్కడే!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్‌కోచ్‌!
అదే సమయంలో గంభీర్‌ సీనియర్‌ జట్టుతో కలిసి స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో భాగమవుతాడని సమాచారం. కాగా ప్రస్తుతం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్‌.. గతంలో కూడా టీమిండియా హెడ్‌కోచ్‌ల గైర్హాజరీలో.. సీనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

వీళ్లు కూడా..
ఇక జింబాబ్వే టూర్‌లో లక్ష్మణ్‌తో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్‌ సునిల్‌ జోషి కోచింగ్‌ సిబ్బందిలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌ కోచ్‌గా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు సమాచారం. 

మరోవైపు.. భారత మాజీ బ్యాటర్‌ హృషికేశ్‌ కనిత్కర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జట్టు, సిబ్బంది బృందం ఆసియా క్రీడల్లోనూ భాగం కానున్నట్లు సమాచారం.

కాగా ఆసియా క్రీడలు సెప్టెంబరు 19- అక్టోబరు 4 మధ్య జపాన్‌లో జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్‌తో టీమిండియా సొంతగడ్డపై సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించింది. ఈ క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్‌ జట్టు చేతిలో టీ20 సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌ అయింది. దీంతో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్‌కు గాయం!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement