నీరజ్‌ చోప్రాపై గ‌గ‌న్ నారంగ్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌ | Gagan Narang interesting comments on Neeraj Chopra | Sakshi
Sakshi News home page

Gagan Narang: నీరజ్‌ మరింతగా దూసుకుపోతాడు

May 20 2025 3:48 PM | Updated on May 20 2025 4:14 PM

Gagan Narang interesting comments on Neeraj Chopra

మాజీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ జోస్యం

న్యూఢిల్లీ: భారత టాప్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఇటీవలే 90 మీటర్ల మార్క్‌ను అధిగమించి ఇకపై మరింత పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాడు. తాజా ప్రదర్శనతో నీరజ్‌పై ఒక పెద్ద భారం దిగిపోయిందని, మున్ముందు అతని నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చని భారత మాజీ షూటర్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ (Gagan Narang) అభిప్రాయపడ్డాడు. దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా జావెలిన్‌ను నీరజ్‌ 90.23 మీటర్ల దూరం విసిరాడు.

‘ఇంత కాలం నీరజ్‌ తన వీపుపై 90 మీటర్ల లక్ష్యం అనే పెద్ద బరువును మోసుకొని తిరిగాడు. అతని మనసులో కూడా అదే భావనతో ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు అదంతా తొలగిపోయింది. ఇకపై మరింత స్వేచ్ఛగా ఆడి ఇంతకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేను కూడా ఒక దశలో 600/600 పాయింట్ల కోసం ఎంతో శ్రమించా. 597–599 చాలాసార్లు సాధించినా అసలైన అంకె మాత్రం రాలేదు. ఎట్టకేలకు దానిని అందుకున్న తర్వాత స్వేచ్ఛ లభించినట్లయింది’ అని గగన్‌ అన్నాడు. నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) సాధించిన ఘనతలు కేవలం దూరానికి సంబంధించినవి మాత్రమే కాదని, అంతర్జాతీయ వేదికలపై అతని స్థాయిని చూపించాయని గగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘దోహాలో నీరజ్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను సాధించిన చాలా పెద్ద ఘనత. అయితే దీనిని కేవలం 90 మీటర్ల దూరం అనే లెక్కల్లోనే చూడవద్దు. భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి అతను చరిత్రను తిరగరాస్తున్నాడు. ఒక తరం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు. సీజన్‌లో ఇది తొలి టోర్నీ మాత్రమే. మున్ముందు చాలా పోటీలు ఉన్నాయి. కాబట్టి మైలురాయిని దాటడమే కాదు సరైన సమయంలో సరైన ఫలితం సాధించడం కూడా ముఖ్యం’ అని ఈ హైదరాబాదీ షూటర్‌ వ్యాఖ్యానించాడు.

మరోవైపు షూటింగ్‌ లీగ్‌ నిర్వహించాలనే ఆలోచన పట్ల అతను సానుకూలంగా స్పందించాడు. ‘చాలా కాలంగా దీని గురించి చర్చ సాగింది. మన షూటర్లు జర్మనీలోని బుండెస్‌లీగాలో ఆడేందుకు వెళుతుంటారు. ఇప్పుడు మనకూ ఒక లీగ్‌ ఉంటుంది. ప్రతీ జట్టులో సీనియర్, యూత్, జూనియర్‌ ఆటగాళ్లు ఉండటం షూటింగ్‌కు మేలు చేస్తుంది. లీగ్‌ నిర్వహణకు ఇది సరైన సమయం కూడా’ అని గగన్‌ నారంగ్‌ విశ్లేషించాడు.

చ‌ద‌వండి: PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్‌ జాబితా ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement