
లండన్: ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటలీ టెన్నిస్ స్టార్ ఫాబియో ఫాగ్‌నిని ప్రకటించాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫాగ్‌నిని తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్‌కరాజ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల ఫాగ్‌నిని ఐదు సెట్‌లు పోరాడాడు.
ఈ ఏడాది చివర్లో ఆటకు గుడ్‌బై చెప్పాలని ఫాగ్‌నిని అనుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో వరుసగా పది పరాజయాలు ఎదురుకావడంతో వింబుల్డన్ టోర్నీ సందర్భంగానే అతను రిటైర్మెంట్ ప్రకటనను జారీ చేశాడు.
‘ఆటకు గుడ్‌బై చెప్పాక ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మాత్రం కుటుంబంతో గడుపుతాను’ అని కెరీర్‌లో 9 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఫాగ్‌నిని తెలిపాడు. 2019లో మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఫాగ్‌నిని అదే ఏడాది కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
2015 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)ను పెళ్లి చేసుకున్న ఫాగ్‌నిని తన 20 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 63 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాడు. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన. ప్రస్తుతం ఫాగ్‌నిని 138వ ర్యాంక్‌లో ఉన్నాడు.