
కౌంటీ క్రికెట్‌లో ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్, సర్రే ఆటగాడు డామినిక్ సిబ్లీ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో భాగంగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిబ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సిబ్లీ 475 బంతులు ఎదుర్కొని 29 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 305 పరుగులు చేశాడు. సిబ్లీకి కెరీర్‌లో ఇదే మొదటి ట్రిపుల్ సెంచరీ.
ఇదే ఇన్నింగ్స్‌లో మరో ముగ్గురు సర్రే ఆటగాళ్లు కూడా సెంచరీలు చేశారు. ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడే సామ్ కర్రన్ (124 బంతుల్లో 108; 14 ఫోర్లు, సిక్స్), ముంబై ఇండియన్స్‌కు ఆడే విల్ జాక్స్ (94 బంతుల్లో 119; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకాలు బాదారు. మరో ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆటగాడు డాన్ లారెన్స్ (149 బంతుల్లో 178; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు.
సర్రే ఇన్నింగ్స్‌లో ఓ హాఫ్ సెంచరీ కూడా నమోదైంది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు మాజీ ఆటగాడు రోరి బర్న్స్ 74 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఓ ట్రిపుల్ సెంచరీ, 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదు కావడంతో సర్రే రికార్డు బ్రేకింగ్ స్కోర్ చేసింది.
ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 820 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ క్లబ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. 1899లో సోమర్‌సెట్‌పై చేసిన 811 పరుగుల స్కోర్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు సర్రే అత్యధిక స్కోర్‌గా ఉండింది. ఈ మ్యాచ్‌లో సర్రే 126 రికార్డును బద్దలు కొట్టింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డర్హమ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఎమిలియో గే 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆలెక్స్ లీస్ (33), విల్ రోడ్స్ (16) క్రీజ్‌లో ఉన్నారు. డర్హడ్ సర్రే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 761 పరుగులు వెనుకపడి ఉంది.
కౌంటీ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
ఈ మ్యాచ్‌లో సర్రే చేసిన స్కోర్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. కౌంటీల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు యార్క్‌షైర్ పేరిట ఉంది. 1896లో ఆ జట్టు వార్విక్‌షైర్‌పై 887 పరుగులు చేసింది. రెండో అత్యధిక స్కోర్ లాంకాషైర్ (863), మూడో అత్యధిక స్కోర్ సోమర్‌సెట్ (850/7) పేరిట ఉన్నాయి.