
World Cup 2023 - Shubman Gill: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తప్పక రాణిస్తాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్ హ్యాండర్‌కు మెరుగైన రికార్డు ఉందన్న విషయాన్ని గుర్తు చేశాడు. సొంతగడ్డపై గిల్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని జోస్యం చెప్పాడు.
విండీస్ పర్యటనలో విఫలం
కాగా వెస్టిండీస్ పర్యటనలో శుబ్‌మన్ గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ రాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ పంజాబీ బ్యాటర్ తేలిపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ ఉసూరుమనిపించాడు.
అయితే, మూడో వన్డేలో 85 పరుగులతో రాణించినప్పటికీ.. టీ20 సిరీస్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. నాలుగో టీ20లో 77 పరుగులు మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో అహ్మదాబాద్ పిచ్‌పై మాత్రమే గిల్ ఆడతాడంటూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇక ఆసియా వన్డే కప్, వన్డే ప్రపంచకప్ రూపంలో కీలక టోర్నీలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో శుబ్‌మన్ గిల్ నిలకడలేని ఫామ్ ఆందోళనకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తప్పక రాణిస్తాడు.. ఎందుకంటే
‘‘ఈ ఫార్మాట్లో(వన్డే) అతడికి మంచి రికార్డు ఉంది. కాబట్టి మెగా ఈవెంట్లో అతడు తప్పక రాణిస్తాడని నమ్ముతున్నా. గతంలో తన రికార్డులను పరిశీలిస్తే అతడి ఆట తీరు ఎలా ఉందో మనకు తెలుస్తుంది. తనకు కేవలం టెస్టు క్రికెట్‌లోనే సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డేల్లో మాత్రం అతడి ప్రదర్శనలు మెరుగ్గానే ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు.
ఇక బౌలర్లు కొత్త బంతితో బరిలోకి దిగినపుడు గిల్ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్.. ఈ యువ బ్యాటర్‌కు సూచించాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన శుబ్‌మన్ గిల్.. 1437 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు, ఒక ద్విశతకం ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం