నేటి నుంచి భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య తొలి అనధికారిక టెస్టు
బరిలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తదితరులు
లింకన్ (న్యూజిలాండ్): ఒకవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు... న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ఆడుతుండగా... మరోవైపు భారత ‘ఎ’ జట్టు న్యూజిలాండ్ ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభం కానుంది. టి20, వన్డే సిరీస్‌ల అనతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ కీలకం కానుండటంతో... టీమ్ మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది.
టెస్టు ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్లేయర్లను భారత ‘ఎ’ జట్టుకు ఎంపిక చేసింది. దీంతో వారికి న్యూజిలాండ్ పరిస్థితులపై ఒక అవగాహన రానుంది. టెస్టు జట్టు కీలక ప్లేయర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌కు ఈ సిరీస్ ఎంతో మేలు చేయనుంది. భారత ‘ఎ’ జట్టుకు ధ్రువ్ జురేల్ సారథ్యం వహిస్తుండగా... దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, అన్షుల్ కంబోజ్ వంటి పలువురు ప్రధాన ఆటగాళ్లు ఇందులో ఆడనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్... ఇంకా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోనే ఉండటంతో అతడి స్థానంలో కుమార్ కుషాగ్రను ఎంపిక చేశారు.
తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన పంత్... మూడో అనధికారిక టెస్టు వరకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ‘ఈ అనధికారిక టెస్టు సిరీస్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. భారత ‘ఎ’ జట్టు తరఫున పలువురు టీమిండియా టెస్టు ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. అలాగే మరి కొంత మంది జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న వారు ఉన్నారు. వాళ్లందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ప్లేయర్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించినట్లు అవుతుంది’ అని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ తెలిపాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ సిరీస్‌ను తమ ప్లేయర్లకు ప్రాక్టీస్‌గా భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల అనధికారి టెస్టు సిరీస్ కోసం 19 మందితో ప్రకటించిన న్యూజిలాండ్ ‘ఎ’ జట్టులో 11 మంది సీనియర్ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లు ఉన్నారు.


