FIFA 2022: భారత్‌లో అమ్మాయిల ‘కిక్‌’స్టార్ట్‌

FIFA 2022: India prepares to Kick off the Dream - Sakshi

అమెరికాతో తొలి మ్యాచ్‌

అండర్‌–17 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

రాత్రి గం. 8 నుంచి స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం  

భువనేశ్వర్‌: ‘ఫిఫా’ అమ్మాయిల అండర్‌–17 ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. 16 జట్ల మధ్య ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీని భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలలో నిర్వహిస్తారు. గ్రూప్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుండగా, మరో మ్యాచ్‌లో 2008 రన్నరప్‌ అమెరికాతో భారత్‌ ఎదుర్కోనుంది. ఈ వయో విభాగంలో జరుగుతున్న ఏడో ప్రపంచకప్‌ లో భారత్‌ ఆడటం ఇదే మొదటిసారి. ఆతిథ్య హోదాతో బెర్త్‌ లభించగా మిగతా జట్లు ఆరు కాన్ఫెడరేషన్ల టోర్నీలతో అర్హత సాధించాయి.

ఆసియా నుంచి భారత్‌తో పాటు చైనా, జపాన్‌... ఆఫ్రికా కాన్ఫెడరేషన్‌ నుంచి మొరాకో, నైజీరియా, టాంజానియా... సెంట్రల్, ఉత్తర అమెరికా, కరీబియన్‌ల నుంచి కెనడా, మెక్సికో, అమెరికా, దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఓసియానియా నుంచి న్యూజిలాండ్, యూరోప్‌ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌కు ప్రతీ మ్యాచ్‌ అగ్నిపరీక్షే! అమెరికా, బ్రెజిల్, మొరాకోలతో క్లిష్టమైన పోటీలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్‌ దశ దాటడం అసాధ్యమే! అద్భుతాలకు ఏ మాత్రం చోటులేదు. ‘బి’ గ్రూపులో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్‌.. ‘సి’లో స్పెయిన్, కొలంబియా, మెక్సికో, చైనా.. ‘డి’లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్‌ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ నెల 30న ఫైనల్‌ జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top