
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట సాగుతున్న వేల ఓ ఆసక్తికర ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ ఫోటోలో టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ బాధపడుతూ (ఏడుస్తూ) ఉన్నట్లు కనిపించగా.. సహచరుడు కేఎల్ రాహుల్ అతన్ని ఓదారుస్తున్నట్లు కనిపించాడు.
ఈ ఫోటో సోషల్‌మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరలైంది. ఇది చూసి క్రికెట్ అభిమానులు కరుణ్‌ను నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు ఏడుస్తున్నాడంటూ, బాధలో ఉన్న అతన్ని అతని ఆప్తమిత్రుడు కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నాడంటూ ఊహించుకోవడం మొదలు పెట్టారు.
దీనిపై ఫ్యాక్ట్ చేయగా అది నిజం కాదని తెలిసింది. వాస్తవానికి ఆ ఫోటో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా తీసిందని తేలింది. కరుణ్, రాహుల్ లార్డ్స్ బాల్కనీలో కూర్చున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నాలుగో టెస్ట్ నుంచి తప్పించినందుకు కరుణ్ ఏడుస్తున్నాడన్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.
కాగా, కరుణ్ నాయర్ దేశవాలీ క్రికెట్‌లో అద్భుతాలు చేసి ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో క్రికెట్ ఒక్క ఛాన్స్ అంటూ కరుణ్ చేసిన ఓ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలైంది. ఎట్టకేలకు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక జట్టులో (నాలుగో టెస్ట్) స్థానం కోల్పోయాడు.
కరుణ్ స్థానంలో మేనేజ్‌మెంట్ నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వగా అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బరిలోకి దిగి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో సాయి సుదర్శన్ భారత జట్టులో నంబర్-3 స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని ప్రచారం మొదలైంది. ఇది పరోక్షంగా కరుణ్ కెరీర్ ముగిసినట్లేనన్న సంకేతాలిస్తుంది.
కెరీర్ ముగిసిపోయిందన్న బాధలో కరుణ్ ఏడుస్తున్నాడని అభిమానులు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి కరుణ్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా పెద్ద తప్పిదం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని మరో అవకాశం రావడం దాదాపుగా అసాధ్యం.
ఒకవేళ సాయి సుదర్శన్ కూడా తదుపరి మ్యాచ్‌ల్లో విఫలమైనా కరుణ్‌కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువకులతో పాటు శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో స్థానంలో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ కెరీర్ ముగిసిందనే చెప్పుకోవాలి.
ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసేసింది. రూట్ రికార్డు సెంచరీతో ఆ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసి 141 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ 150, జేమీ స్మిత్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, శార్దూల్ ఠాకూర్ 41 భారత ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.