'If Suryakumar was in Pakistan' : Ex-PAK Captain Explosive Remark on India Star - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: సూర్య ఇండియన్‌ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్‌లో ఉంటేనా: పాక్‌ మాజీ కెప్టెన్‌

Jan 9 2023 10:35 AM | Updated on Jan 9 2023 11:20 AM

Ex PAK Captain Explosive Remark: If Suryakumar Was In Pakistan - Sakshi

Suryakumar Yadav: ‘‘అతడు 30వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడని నేనెక్కడో చదివాను. అతడి ఫిట్‌నెస్‌, బ్యాటింగ్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది’’ అని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ అన్నాడు. తను గనుక పాకిస్తాన్‌లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు. టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

సూర్య గ్రేట్‌ ఇన్నింగ్స్‌
శ్రీలంకతో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. రాజ్‌కోచ్‌ మ్యాచ్‌లో ‘పవర్‌ ప్లే’ ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చాడు సూర్య. 6 ఓవర్ల పవర్ల ప్లేనే అయిపోయింది. కానీ.. మిగతా 14 ఓవర్ల పవర్‌ స్ట్రోక్స్‌ ఎలావుంటాయో ‘స్కై’ చూపెట్టాడు. కవర్‌ డ్రైవ్, ర్యాంప్‌ షాట్లతో టచ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ స్కోరు బోర్డును ఆద్యంతం పరుగు పెట్టించాడు. 

26 బంతుల్లోనే ఫిఫ్టీ
స్పిన్, పేస్, గూగ్లీ ఇలా ఏ బంతి వేసిన తన శైలి షాట్లతో చెలరేగిపోయాడు. పేస్‌తో ముఖం మీదికి వచ్చే బంతుల్ని విడిచి పెట్టలేదు. అదే పనిగా ర్యాంప్‌ షాట్లతో సిక్స్‌లు, ఫోర్లుగా దంచేస్తూ 26 బంతుల్లోనే ఫిఫ్టీని అవలీలగా పూర్తి చేసుకున్నాడు. అతని షాట్లకు ఆకాశమే హద్దయ్యింది. ఫుట్‌ టాస్‌ బంతుల్ని, యార్కర్‌ డెలివరీల్ని మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలకు తరలించాడు. ఎలా వేసినా దంచేశాడు. 

అతని ధాటికి లంక బౌలర్‌ మదుషంక 13వ ఓవర్లో 18 పరుగులు రాగా... తీక్షణ మరుసటి ఓవర్లో 2, 4, 6, 6, 1లతో సూర్య వేగం ఇంకాస్త పెంచాడు. ఆఖరి బంతిని ఆడిన గిల్‌ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. కేవలం ఈ రెండు ఓవర్లలోనే భారత్‌ 113/2 నుంచి 154/2కు చేరింది. హసరంగ 15వ ఓవర్లో గిల్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (4), దీపక్‌ హుడా (4) స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించినా... సూర్య బాదుడుకు అదేమంతా ప్రభావమే చూపలేదు. 

మూడో సెంచరీ
ఆఖర్లో జతయిన అక్షర్‌ పటేల్‌ (9 బంతుల్లో 21 నాటౌట్‌; 4 ఫోర్లు) చకచకా బౌండరీలు బాదాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి భారత్‌ స్కోరు 200కు చేరగా, 19వ ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్‌ (45 బంతుల్లో; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ పూర్తయ్యింది. పొట్టి ఫార్మాట్‌లో అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. ఇక సూర్య తుపాన్‌ ఇన్నింగ్స్‌ ధాటికి 228 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా 91 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోండగా... పాక్‌ మాజీ సారథి సల్మాన్‌ భట్‌ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. సూర్యను కొనియాడుతూనే తమ బోర్డు గత విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా.. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కుదరదని సర్ఫరాజ్‌ అహ్మద్‌ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. యూట్యూబ్‌లో ప్రస్తావించిన సల్మాన్‌.. సూర్య పాకిస్తాన్‌లో ఉండి ఉంటే అసలు అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేవాడే కాదన్నాడు.


సల్మాన్‌ భట్‌

ఇండియన్‌ కావడం తన అదృష్టం
‘‘తను భారతీయుడు కాబట్టి 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయగలిగాడు. కొంతమంది జట్టులోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఆడకపోయినా ఏదో నెట్టుకొస్తారు. మరి కొంతమందికి అసలు అవకాశాలే రావు. కానీ సూర్యకుమార్‌ విషయం విభిన్నం. 30లలో అతడు జట్టులోకి రావడం గొప్ప విషయం. 

నిజానికి ఇండియన్‌ కావడం తన అదృష్టం. ఒకవేళ తనే గనుక పాకిస్తాన్‌లో ఉండి ఉంటేనా.. 30 ఏళ్లు పైబడిన బాధితుల జాబితాలో ఉండిపోయేవాడు. బ్యాటింగ్‌లో సూర్య పరిణతి చూస్తుంటే.. ఏ బౌలర్‌ ఎలాంటి బాల్‌ వేస్తాడో తనకు ముందుగానే తెలిసినట్లు అనిపించింది’’ అని సల్మాన్‌ భట్‌ పేర్కొన్నాడు. కాగా 2021లో తనకు 30 ఏళ్ల వయసున్నపుడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో మ్యాచ్‌తో సూర్య అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: IND vs SL: డివిలియర్స్‌, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
శ్రీలంకతో వన్డే సిరీస్‌.. టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement