Ind vs SL ODI Series 2023: Check schedule, squads, date and more details - Sakshi
Sakshi News home page

శ్రీలంకతో వన్డే సిరీస్‌.. టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే..?

Jan 9 2023 9:47 AM | Updated on Jan 9 2023 10:19 AM

IND VS SL ODI Series: Team India And Schedule - Sakshi

IND VS SL ODI Series:  శ్రీలంకపై 2-1 తేడాతో టీ20 సిరీస్‌ నెగ్గి ఈ ఏడాది (2023) ఘనంగా బోణీ కొట్టిన టీమిండియా రేపటి నుంచి (జనవరి 10) అదే జట్టుతో వన్డే సిరీస్‌ ఆడనుంది. రేపు గౌహతి వేదికగా తొలి వన్డే ఆడనున్న భారత్‌.. జనవరి 12న రెండో వన్డే (కోల్‌కతా), జనవరి 15న మూడో వన్డే (తిరువనంతపురం) ఆడుతుంది.

టీ20 సిరీస్‌కు రెస్ట్‌ తీసుకున్న సీనియర్లు వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. సీనియర్ల రాకతో టీ20 జట్టులో ఉండిన రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, ముఖేష్ కుమార్, జితేశ్ శర్మ, శివమ్ మావి, సంజూ శాంసన్ పక్కకు తప్పుకోక తప్పలేదు.  

వన్డే సిరీస్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి సారధ్య బాధ్యతలు చేపట్టనుం‍డగా.. విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రాలు జట్టులో చేరనున్నారు. వీరిలో బుమ్రా చాలాకాలం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నాడు. యువ పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో బుమ్రా మునుపటి జోరును కనబరుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్‌ సిరాజ్‌ క్రమం తప్పకుండా సత్తా చాటుతుండటంతో వెటరన్‌ పేసర్‌ షమీకి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది అనుమానంగా మారింది. బ్యాటింగ్‌ విభాగం విషయానికొస్తే.. సీనియర్లు రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ రాకతో యువ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ల స్థానాలు సందిగ్ధంలో పడ్డాయి. 

రోహిత్‌, రాహుల్‌ను కాదని వీరికి తుది జట్టులో ఛాన్స్‌ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వన్‌ డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌, ఐదో ప్లేస్‌లో మిస్టర్‌ స్టేబుల్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఆల్‌రౌండర్ల కోటాలో హార్ధిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో చహల్‌ లేదా కుల్దీప్‌, పేసర్లుగా జస్ప్రీత్‌ బుమ్రా, షమీ లేదా సిరాజ్‌, అర్షదీప్‌ లేదా ఉమ్రాన్‌ మాలిక్‌లకు తుది జట్టులో చోటు దొరికే అవకాశం ఉంది. 

లంకతో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement