
మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ స్మరణార్ధం ఇంగ్లండ్ ఆటగాళ్లు ‘ఎ డే ఫర్ థోర్పీ’ పేరుతో నివాళి అర్పించారు. ఆటగాడిగా ఉన్నప్పుడు తలకు హెడ్‌బ్యాండ్ ధరించి బ్యాటింగ్‌కు వచ్చే థోర్ప్‌ను గుర్తు చేసుకుంటూ...ఇంగ్లండ్ క్రికెటర్లు మ్యాచ్ రెండో రోజు అదే తరహా తెలుపు హెడ్‌బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. థోర్ప్ సొంత మైదానమైన ఓవల్ గ్రౌండ్‌లోనే టెస్టు జరుగుతున్న నేపథ్యంలో అతని భార్య, కూతురు ఆటకు ముందు గంట మోగించారు.
మ్యాచ్ సందర్భంగా ప్రత్యేకంగా నిధుల సేకరణ కూడా జరిగింది. శుక్రవారం థోర్ప్ పుట్టిన రోజు కాగా...ఏడాది క్రితం 55 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6744 పరగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 82 వన్డేల్లో 37.18 సగటుతో 2380 పరుగులు సాధించాడు.