
ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేకబ్ బేతెల్ ఓ ముసలి మహిళా అభిమాని కోరిక తీర్చాడు. వెస్టిండీస్‌తో నిన్న (జూన్ 8) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ యువకుడు తన బామ్మ కోసం ఓ సిక్స్ కొట్టాలని బేతెల్‌ను కోరాడు. అడిగిందే తడువుగా బేతెల్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో (రెండో బంతి) సిక్సర్ కొట్టి బామ్మ కోరిక నెరవేర్చాడు.
అల్జరీ జోసఫ్ వేసిన ఆ ఓవర్‌లో అంతకుముందు బంతికి కూడా బేతెల్ సిక్సర్ బాదాడు. అదే ఓవర్‌లో ఐదో బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన బేతెల్, చివరి బంతికి ఔట్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లో బేతెల్ ఆడిన ఇన్నింగ్స్ ఛేదనలో ఇంగ్లండ్ గెలుపుకు దోహదపడింది. ఈ ఇన్నింగ్స్‌లో బేతెల్ 10 బంతులు ఆడి 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా విండీస్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాన్సన్ ఛార్లెస్ (47), షాయ్ హోప్ (49) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్)) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో విండీస్ చివరి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు చేసింది. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్‌లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్‌లో 8, ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.
అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్ డకెట్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బేతెల్ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టామ్ బాంటన్ (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌లు సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 మంగళవారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది.