
భారత్-ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.
374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
అంత ఈజీ కాదు
ఐదో రోజు ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం 35 పరుగులే అయినప్పటికీ ఇది అంత ఈజీ కాదు. 22 బంతుల తర్వాత భారత బౌలర్ల చేతికి కొత్త బంతి వస్తుంది. కొత్త బంతితో భారత బౌలర్లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ టెయిలెండర్లకు కత్తి మీద సామే అవుతుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వికెట్ సమర్పించుకోక తప్పదు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత పేసర్లు సర్వశక్తులు ఒడ్డి వికెట్ల కోసం ప్రయత్నిస్తారు. నాలుగో రోజు చివర్లోనే సిరాజ్, ప్రసిద్ద్ లయను అందుకున్నారు. ఐదో రోజు ఆరంభంలోనే వికెట్ పడితే ఇంగ్లండ్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. క్రీజ్‌లో ఉన్న ఆటగాళ్లలో జేమీ స్మిత్‌ను తప్పిస్తే ఆట భారత్‌వైపుకు మళ్లే అవకాశం లేకపోలేదు.
ఇంగ్లండ్‌కు శుభవార్త
ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు శుభవార్త వినిపించింది. తొలి రోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ అవసరమైతే బ్యాటింగ్‌కు వస్తాడని జో రూట్ తెలిపాడు. వోక్స్‌కు ఎడమ భుజం మిస్ లొకేట్ అయినప్పటికీ జట్టు కోసం గాయాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు వస్తాడని రూట్ స్పష్టం చేశాడు.
అయినా, మ్యాచ్ అంతవరకు (వోక్స్ బ్యాటింగ్ చేసేంత వరకు) వస్తుందని అనుకోవట్లేదని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా గాయాన్ని (విరిగిన పాదం) లెక్క చేయకుండా బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే.
బ్రూక్, రూట్ సెంచరీలు
భారీ లక్ష్య ఛేదనలో బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గెలుపుతీరాల వరకు తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్ డిఫెన్స్‌లో పడింది. 36 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ బ్రూక్, రూట్‌తో పాటు జేకబ్ బేతెల్ వికెట్ కూడా కోల్పోయి తడబాటుకు లోనైంది.
జైస్వాల్ సూపర్ శతకం
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.