
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నాడు. జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు అజేయమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి సరసన చేరాడు.
ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ - 30 ఇన్నింగ్స్‌లలో 1575 పరుగులు
రాహుల్ ద్రవిడ్ - 23 ఇన్నింగ్స్‌లలో 1376 పరుగులు
సునీల్ గవాస్కర్ - 28 ఇన్నింగ్స్‌లలో 1152 పరుగులు
కేఎల్ రాహుల్ - 26 ఇన్నింగ్స్‌లలో 1125 పరుగులు
విరాట్ కోహ్లీ - 33 ఇన్నింగ్స్‌లలో 1096 పరుగులు
రిషబ్ పంత్ - 24 ఇన్నింగ్స్‌లలో 1035 పరుగులు
రవీంద్ర జడేజా - 31 ఇన్నింగ్స్‌లలో 1016* పరుగులు
మ్యాచ్ విషయానికొస్తే.. ఆట చివరి రోజు టీమిండియా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడుతున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 100 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. సుందర్ 58, జడ్డూ 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
టీ విరామం సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ స్కోర్ 322/4గా ఉంది. ప్రస్తుతం భారత్ 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించాలంటే భారత్ మరో రెండున్నర గంటల్లోపు ఆలౌట్ కాకుండా చూసుకోవాలి.
311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో రాహుల్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.
రాహుల్ ఔటయ్యాక చాలా జాగ్రత్తగా ఆడిన గిల్ ఈ సిరీస్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా (222 పరుగుల వద్ద) వెనుదిరిగాడు. ఇవాళ భారత్ తొలి సెషన్‌లోనే ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో సుందర్, జడేజా భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
స్కోర్ వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్- 358 ఆలౌట్ (సాయి సుదర్శన్ 61, జైస్వాల్ 58, పంత్ 54, స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 669 ఆలౌట్ (రూట్ 150, స్టోక్స్ 141, రవీంద్ర జడేజా 4/143)