నేటి నుంచి రంజీ ట్రోఫీ రెండో అంచె పోటీలు
బరిలో టీమిండియా స్టార్ ప్లేయర్లు
సౌరాష్ట్రతో పంజాబ్ ‘ఢీ’ ∙విదర్భతో ఆంధ్ర పోరు
రాజ్‌కోట్: రెండు నెలల విరామం అనంతరం దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడుతుండగా... ఈ ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని టాప్ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్... పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సిరాజ్ హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు.
వీరితో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా పలువురు టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. నవంబర్ రెండో వారంలో చివరగా రంజీ మ్యాచ్‌లు జరగగా... రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజీ ట్రోఫీకి విరామం ఇచ్చిన సమయంలో ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ జరిగాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మాజీ విజేత విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది.
ఈ మ్యాచ్‌కు అనంతపురం వేదిక కానుంది. తొలి అంచె పోటీల్లో 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, 2 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. విదర్భ 25 పాయింట్లతో ‘టాప్’లో కొనసాగుతోంది. మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా... ఇప్పటి వరకు ఒక్కో జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడాయి.
ఇక లీగ్ దశలో రెండేసి మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, విదర్భ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్న పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. శ్రీకర్ భరత్, రికీ భుయ్, షేక్ రషీద్‌లతో ఆంధ్ర జట్టు బలంగా ఉండగా... విదర్భ జట్టు ఇటీవలే విజయ్ హజారే వన్డే ట్రోఫీ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది.
సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోగా... ఆ వెంటనే శుబ్‌మన్ గిల్ పంజాబ్ జట్టుతో చేరాడు. నేటి నుంచి సౌరాష్ట్రతో జరగనున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో గిల్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ కూడా మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు.


