
భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి నిలకడగా ఆడుతుంది. 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 39, యశస్వి జైస్వాల్ 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఈ సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఎంత కష్టపడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రాహుల్, జైస్వాల్ నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
క్రిస్ వోక్స్ బౌలింగ్‌ను ఎదుర్కోబోయి జైస్వాల్ బ్యాట్ రెండు ముక్కలైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వోక్స్ సంధించిన బంతి ఏమంత వేగవంతమైంది కాదు. జైస్వాల్ డిఫెన్స్ ఆడినా బ్యాట్ హ్యాండిల్ దగ్గర చీలిపోయింది. దీంతో అతను బ్యాట్‌ను మార్చకతప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఒత్తిడిలో జైస్వాల్
యశస్వి జైస్వాల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో పర్వాలేదనిపించినప్పటికీ చెత్త షాట్ సెలెక్షన్ కారణంగా ఒత్తిడిలో ఉన్నాడు. మూడో టెస్ట్‌లో అతను ఓ చెత్త ఆడి వికెట్ పారేసుకోవడాన్ని యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ మ్యాచ్‌లో భారత్ 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా.. జైస్వాల్ అవసరం లేని షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంతో పాటు జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.
జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆ మ్యాచ్‌లో టీమిండియా కొంపముంచింది. జైస్వాల్ తన సహజ ఆటతీరుతో ఆడి ఉంటే ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండేది. ఈ చెత్త షాట్ కారణంగా జైస్వాల్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో అతను తొలి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ సహా 241 పరుగులు చేశాడు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. తొలి, మూడో టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది.