
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 67 టెస్ట్‌ల్లో 88 సిక్సర్లు కొట్టాడు.
పంత్ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్‌ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.
ఓవరాల్‌గా చూస్తే టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో పంత్ 5 సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు.
టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 113 మ్యాచ్‌ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్‌కల్లమ్ (107), గిల్‌క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), గేల్ (98), కల్లిస్ (97), సెహ్వాగ్ (91), ఏంజెలో మాథ్యూస్ (90), రోహిత్ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్-10లో).
కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు
కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో పంత్ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఇంగ్లండ్‌లో (టెస్ట్‌ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు.
భీకర ఫామ్‌లో పంత్
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు.
రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది.